ఉమామహేష్‌ను విధుల నుండి తొలగించాలి
ప్రజాశక్తి-కావలి : కావలి మున్సిపాలిటీలో సచివాలయం సెక్రటరీగా పనిచేయాల్సిన బొడ్డు ఉమామహేష్ కమిషనర్ ఏజెంట్‌గా, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా అవతారం ఎత్తి, 3వ డివిజన్‌లో పారిశుధ్య కార్మికులకు మస్టర్ వేస్తూ, కార్మికులకు అడ్డమైన పనులు చెబుతూ, వారిని వేధిస్తున్నారని, ఆయనను తక్షణం అక్కడ నుండి తొలగించి, గుమస్తాగా పని చేయించాలని శనివారం ఎఐటియుసి ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ కావలి డివిజన్ కార్యదర్శి కొప్పర్తి నాగరాజు ధర్నానుద్దేశించి మాట్లాడారు. కావలి మున్సిపల్ కమిషనర్ బి.శివారెడ్డి, ఆఫీసు గుమస్తా శానిటరీ ఇన్‌స్పెక్టర్ అని చెప్పుకుంటున్న బొడ్డు ఉమా మహేష్ అనే వీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులకు ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకు సానిటరీ సెక్రెటరీ ద్వారా మాస్టర్ మాస్టర్ వేయకుండా, ఆఫీస్ గుమస్తా బొడ్డు మహేష్ ద్వారా ప్రతిదినం మస్టర్ వేస్తూ, అతను కార్మికులపై పెత్తనం చలాయిస్తూ, అధికారులను సైతం తన చెప్పు చేతుల్లో పెట్టుకుని భయభ్రాంతులకు గురిచేస్తూ వ్యవహరిస్తున్నాడన్నారు. ఈ 4వ తేదీన విలేకరుల సమావేశం జరిగిందని, కార్యక్రమంలో బొడ్డు ఉమా మహేష్ ధోరణి గురించి మున్సిపల్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎ.రంగనాయకులు కావలి ప్రాంతంలో మాట్లాడారని తెలిపారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ 6న కార్మిక నాయకులను పిలిచి, ''బొడ్డు ఉమా మహేష్ అనే వ్యక్తి శానిటరీ ఇన్‌స్పెక్టర్ కాదనీ, ఆఫీస్ గుమస్తా కాబట్టి అతనిని ఆఫీసులో మాత్రమే తాము పని చేపించుకుంటామని కార్మికులతో చెప్పారన్నారు. అయినా కమిషనర్ మళ్లీ బొడ్డు మహేష్‌కు భయపడి, శనివారం ఉదయం మస్టర్ డివిజన్ దగ్గరికి పంపించి, మస్టర్ వేయమని చెప్పడం సరికాదన్నారు. కార్మికులను వేధిస్తున్న బొడ్డు ఉమా మహేష్, కమిషనర్‌లపై ఉన్నత అధికారులు విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. వీరి కోర్టు కేసులను తప్పుదారి పట్టించి, విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఇలాంటి నేరస్తులు ప్రభుత్వ ఆఫీసులో ఉండకూడదని, వీరిపై ఉన్నతాధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. వీరి ద్వారా ఇప్పటికే కార్మికులు, కావలి ప్రజలు నష్టపోతున్నారు కాబట్టి కరుడుగట్టిన నేరస్తులైన ఇలాంటి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని వీరిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) జిల్లా కార్యదర్శి జి.కిషోర్, అధ్యక్షులు ఎండ్లూరి ఆదినారాయణ, గౌరవ అధ్యక్షులు మల్లె అంకయ్య, ఏసుపోగు ప్రభావతి, బి.రాజేష్, ఆర్.వెంకటేశ్వర్లు, గుర్రం వేణు, గుంజి అంకయ్య, మున్సిపల్ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.










