నాటోను తూర్పు దిశగా విస్తరించాలన్న ప్రయత్న్లాలతోనే ఉక్రెయిన్ ప్రస్తుత సంక్షోభం ఆరంభమైంది. సోవియట్ పతనానంతర కాలంలో నాటోను తూర్పు దిశగా విస్తరించబోమని అమెరికా, రష్యాకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా తూర్పు యురోపియన్ దేశాలన్నింటినీ, వార్సా ఒప్పందంలో భాగమైన బాల్టిక్ దేశాలను నాటో కూటమిలోకి తీసుకువచ్చారు. దాంతో ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో భాగమైన ఉక్రెయిన్, జార్జియాలు కూడా ఆ బాటలోనే వున్నాయని రష్యా భయపడుతోంది. తమ సరిహద్దుల్లోనే నాటో వుందంటే అది తమకు ప్రత్యక్ష భద్రతా ముప్పుగా చూస్తోంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా బలగాలను మోహరించడం, పొరుగున గల బెలారస్‌లో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడంతో పాటుగా అమెరికా, నాటోలు తమకు నిర్దిష్ట భద్రతా హామీలు ఇవ్వాలని రష్యా డిమాండ్ చేస్తోంది. నాటోలో ఉక్రెయిన్ భాగస్వామి కారాదన్నది ప్రధాన డిమాండ్‌గా వుంది. రష్యా సరిహద్దుల్లో ఎలాంటి ప్రమాదకరమైన క్షిపణులు వుంచరాదని కోరుతోంది. రష్యా ఈ స్పష్టమైన, దృడమైన వైఖరి తీసుకోవడాన్ని ఉక్రెయిన్‌కు ప్రత్యక్ష ముప్పుగా అమెరికా పరిగణించింది. ఉక్రెయిన్‌పై దండెత్తడానికి రష్యా సిద్ధపడుతోందంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ పదేపదే అందరినీ బెదిరిస్తూ వచ్చారు. దీంతో ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాలను, రక్షణ పరికరాలను విమానాల్లో తరలించారు. పోలెండ్, రొమేనియాల్లో మరింతమంది అమెరికన్ సైనికులను మోహరించారు. తూర్పు యూరప్‌కు, బాల్టిక్ దేశాలకు బలగాలను పంపాల్సిందిగా నాటో యురోపియన్ భాగస్వాములను కోరారు. నాటో దేశాలన్నింటినీ కూడగట్టి ఐక్య వైఖరి తీసుకునేలా ముమ్మరంగా అమెరికా దౌత్య యత్నాలు మొదలయ్యాయి.
ఈ సంక్షోభంలో ఒక వింతైన ధోరణి ఏమిటంటే, రష్యా బలగాలు తక్షణమే దాడికి సిద్ధంగా వున్నాయని, ఇక ముప్పు అనివార్యమంటూ అధ్యక్షులు జో బైడెన్, ఆయన ప్రభుత్వం ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తూ వుంటే, మరోపక్క ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ, ఆయన ప్రభుత్వం మాత్రం అటువంటి తక్షణ ముప్పు ఏదీ కనిపించడం లేదంటూ తోసిపుచ్చుతూ వచ్చారు. ఫిబ్రవరి 16, 17 తేదీల్లో దాడి జరుగుతుందని భావిస్తున్నట్లు అమెరికా హెచ్చరికలు చేసినపుడు, ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ మాట్లాడుతూ, రష్యా దాడికి సిద్ధమవుతోందంటూ అమెరికా, బ్రిటన్‌లు చెబుతున్నది వారి దగ్గరున్న సాక్ష్యాధారాల ప్రాతిపదికన అయితే వాటిని తాను చూడాలనుకుంటున్నానని అన్నారు. రష్యా దాడి ముప్పు గురించి అమెరికా అధ్యక్షులు అతిగా ప్రచారం చేసిన తీరు చూస్తుంటే రష్యా సైనిక చర్యకు దిగాలని అమెరికా బాగా కోరుకున్నట్లు కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా బలగాల ఉపసంహరణ ప్రహసనం ముగిసిన తర్వాత బైడెన్, రష్యాకు ఎదురొడ్డి నిలబడి తన ప్రతిష్టను పెంచుకోవాలని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన పక్షంలో తీవ్ర ఆర్థిక పర్యవసానాలు వుంటాయని రష్యాను హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై దాడిచేసే ఆలోచనే తమకు లేదని రష్యా పదే పదే చెబుతూ వచ్చినప్పటికీ దానితో నిమిత్తం లేకుండా ఇటువంటి హోరెత్తే ప్రచారాన్ని అమెరికా సాగిస్తోంది.
ఉక్రెయిన్ విషయంలో రష్యాతో ఘర్షణను పెంచడం ద్వారా అమెరికా అధ్యక్షులు బైడెన్, రష్యా, చైనాలు రెండింటి మీద ఒకేసారి మాట్లాడడం ప్రారంభించారు. ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగుతుండగానే ఆస్ట్రేలియాలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాను అదుపు చేసేందుకు ఉద్దేశించిన క్వాడ్ వేదికపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, ఉక్రెయిన్‌పై రష్యా దూకుడుకు వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే రష్యాపై అమెరికా చేస్తున్న దాడితో భారత్ ఏకీభవించలేకపోతున్నందున బ్లింకెన్ మాట్లాడే సమయంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కొంత ఇబ్బంది పడ్డారు. తన సామ్రాజ్యవాద గుత్తాధిపత్యాన్ని కొనసాగించేందుకు అమెరికా భౌగోళిక, రాజకీయ వ్యూహంలో క్వాడ్ ఎలా భాగమైందో ఈ అధ్యాయం తెలియచేస్తోంది. ఈ అంతర్జాతీయ వ్యూహానికి నాటో, క్వాడ్‌లు రెండూ రెండు కోణాలు. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా సాగించే ఆర్భాట ప్రచారం, వాక్చాతుర్యం మాదిరిగా కాకుండా యురోపియన్ యూనియన్‌లో రెండు ప్రధాన దేశాలైన ఫ్రాన్స్, జర్మనీలు రష్యాతో దౌత్యపరంగా చర్చలు చేపట్టాయి. ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్, జర్మనీ చాన్సలర్ షుల్డ్‌లు వరుసగా మాస్కోను సందర్శించారు. అధ్యక్షులు పుతిన్‌తో చర్చలు జరిపారు. సైనిక విన్యాసాలు పూర్తి చేసుకున్న రష్యా బలగాలు కొన్ని వెనక్కి తిరిగి వస్తాయని పుతిన్ ప్రకటించడంతో యుద్ధం చెలరేగుతుందంటూ చేసిన హెచ్చరికలు, బెదిరింపులన్నీ ఒక్కసారిగా నిర్వీర్యమై పోయాయి. తూర్పు ఉక్రెయిన్‌లో ఘర్షణల నేపథ్యంలో 2015లో రష్యా, ఉక్రెయిన్, జర్మనీ, ఫ్రాన్స్‌ల మధ్య కుదిరిన మిన్స్క్ ఒప్పందం అమలయ్యేలా చూడడం, ఇందుకోసం చర్చలు జరగడమే ముందున్న మార్గం.
(పీపుల్స్ డెమోక్రసీ సంపాదకీయం)










