Mar 10,2022 00:17

మాట్లాడుతున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు

ప్రజాశక్తి - పలాస: ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న మిగితా ఎంబిబిఎస్‌ విద్యార్థులను తిరిగి దేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని, ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించి, కేంద్ర ప్రభుత్వ సాయం కోరతామని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. పలాస టిడిపి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చదువుతున్న విద్యార్థులను ఈ యుద్ధం తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ గంగా వల్ల దేశానికి భారతీయ విద్యార్థులు చేరుకున్నారని అన్నారు. పలాసకు చెందిన బగాది ప్రదీప్‌కుమార్‌ తన పాస్‌ పోర్ట్‌ను పోగొట్టుకోడంతో భారత్‌కు రావడానికి ఇబ్బంది పడ్డాడని తెలిపారు. ఎంబసి మంత్రితో మాట్లాడి స్పెషల్‌ ట్రావెల్‌ సర్టిఫికెట్‌ తయారుచేసి భారత్‌కు తీసుకొచ్చామన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల లిస్ట్‌ తయారుచేసి తీసుకురావడానికి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఇక్కడ టిడిపి కేడర్‌తో పాటు యూరప్‌ టిడిపి ఎన్‌ఆర్‌ఐలతో కలసి ఒక కమిటీ వేసి, వారందరనీ తీసుకురావడంలో సఫలీకృతులయ్యామని ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన సహకారిన్ని అభినందిస్తున్నామన్నారు. ఇది చాలా సున్నితమైన అంశమని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ కొనియాడారు. సమావేశంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, తెలుగు యువత జిల్లా నాయకులు దాసునాయుడు, మాజీ ఎఎంసి చైర్మన్‌ మల్లా శ్రీనివాసరావు, చౌదరి బాబూజీ, తదితరులు పాల్గొన్నారు.
వెంకటరావు కుటుంబాన్ని ఆదుకుంటాం
వైసిపి వేధింపులు బరించలేక ఆత్మహత్య చేసుకున్న వెంకటరావు కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని ఎంపీ, గౌతు శిరీష అన్నారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి కార్యకర్తలను వేధింపులకు గురిచేసి మనస్థాపానికి గురిచేస్తున్నారని, ఈ విధంగా కొన వెంకటరావు మరణానికి కారకులయ్యారని ఆరోపించారు. జరిగిన సంఘటనపై ఎవరు ఫిర్యాదు చేస్తే పోలీసులు వెళ్తారో నివృత్తి చేయాలని కోరారు. ఒక వైపు దువ్వాడ శ్రీనివాస్‌ ఫిర్యాదు ఇవ్వలేదంటే.. ఆయన ఫిర్యాదు మేరకు విచారణకు వెళ్లామని పోలీసులు తెలియజేయడం వెనుక ఆంతర్యం ఏమిటో తెలియజేయాలన్నారు. టిడిపి అధినేత మృతునికి కుటుంబానికి రూ.2లక్షలు ఆర్థిక సాయం, పిల్లల చదువు బాధ్యతను తీసుకున్నారని ఎంపీ చెప్పారు.