Feb 11,2022 07:13

సంవత్సర కాలం విశాఖ స్టీల్‌ అమ్మకానికి వ్యతిరేకంగా సాగిన పోరాటం ఆదర్శనీయం.దేశం లోనే ప్రైవేట్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో ఉన్నతమైనది. ఢిల్లీ చుట్టూ మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ ఉద్యమం కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి మూడు నల్ల చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకునే విధంగా చేసింది. ఇదే మనకు స్ఫూర్తిదాయకం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు స్వంత గనులు సమకూర్చాలి. 'విశాఖ స్టీల్‌ను అమ్మం' అని కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రకటించే వరకూ ఈ ఉద్యమం కొనసాగుతుంది.

   విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నూరు శాతం అమ్మాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం 27.1.2021న తీర్మానించింది. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న విశాఖ స్టీల్‌ను అమ్మాలనే నిర్ణయం పట్ల నిరసన పెల్లుబికింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షా శిబిరం ప్రారంభించి ఫిబ్రవరి 12వ తేదీ నాటికి సంవత్సర కాలం పూర్తవుతుంది. విశాఖ స్టీల్‌లో కరోనాకు 150 మంది ఆహుతై మరణించారు. కరోనా కఠోర నియమాలతో కూడా రిలే నిరాహార దీక్షా శిబిరం కొనసాగింది. స్టీల్‌ పోరాటానికి సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా ఫిబ్రవరి 12వ తేదీన 365 ఐక్య జెండాలతో నిరసన, అదే రోజు సాయంత్రం కరోనా అమర వీరులకు శ్రద్ధాంజలి, వివిధ పోరాట కళారూపాలు ప్రదర్శిస్తారు. ఫిబ్రవరి 13వ తేదీన వేలాదిమందితో గాజువాక పోలీస్‌ స్టేషన్‌ దగ్గర 'జైల్‌ భరో' సాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 11, 12, 13 తేదీలలో కలెక్టర్లకు వినతిపత్రాలు, వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతారు.
    దేశవ్యాప్తంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం అనేక భారీ పరిశ్రమలను కారుచౌకగా అమ్మకానికి పెట్టింది. కాని ఏ పరిశ్రమలో సాగని విధంగా విశాఖ స్టీల్‌లో సంవత్సర కాలం నిరంతరంగా సమరశీల పోరాటాలు ఎలా సాధ్యం? గుర్తింపు యూనియన్‌గా ఉన్న సిఐటియు ఆధ్వర్యంలో పర్మినెంట్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, ఆఫీసర్ల సంఘాలన్నింటినీ ఒకే వేదిక పైకి తెచ్చి ''విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ''ని 32 మందితో ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఏకాభిప్రాయంతో సంవత్సర కాలం నిర్ణయాలు చేయబడ్డాయి. వేరు వేరు జెండాలు లేకుండా ''విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు'' అనే ఒకే జెండా, ''విశాఖ స్టీల్‌ను అమ్మనివ్వం'' అనే ఒకే ఎజెండాతో ఉద్యమం కొనసాగుతున్నది. బిజెపి అనుబంధమైన బి.యం.యస్‌ యూనియన్‌తో సహా ఈ కమిటీలో కొనసాగడం యావత్తు స్టీల్‌ప్లాంట్‌ ఐక్యతను చాటింది.
    విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మాలనే నిర్ణయానికి నిరసనగా... గతేడాది ఫిబ్రవరి 18వ తేదీన... రాజకీయాలకు అతీతంగా భారీ సభలో బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు పలికాయి. అఖిల భారత ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు ఢిల్లీ నుంచి వచ్చి త్రిష్ట గ్రౌండ్స్‌లో పోరాటాన్ని ఉధృతం చేశారు. రాకేష్‌ తికాయత్‌, అశోక్‌ ధావలే, వెంకట్‌ లతో సహా కిసాన్‌ సంయుక్త మోర్చా నాయకత్వం విశాఖ బీచ్‌లో జరిగిన కార్మిక రైతు శంఖారావ సభ విశాఖ ఉక్కు ఉద్యమానికి హాజరై మరింత స్ఫూర్తినిచ్చింది. అగనంపూడి నుండి అక్కిరెడ్డిపాలెం వరకూ 10 కిలోమీటర్ల మానవహారం పోరాటానికి ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. మానవహారంలో అత్యధికంగా మహిళలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాపితంగా రెండు బంద్‌లు, రెండు గంటల రాస్తా రోకోలు బాగా జయప్రదం అయ్యాయి. గత ఆగస్టు 2, 3 తేదీలలో ఢిల్లీలో వెయ్యి మందితో జరిగిన ధర్నాకు 30 మంది ఎం.పి.లు, ప్రతిపక్ష నాయకులు వచ్చి సంఘీభావం ప్రకటించారు. జాతీయ ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టాం. ప్రతి జిల్లాలో సదస్సులు, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, పంచాయితీ, గ్రేటర్‌ విశాఖ కార్పొరేషన్‌తో సహా మున్సిపాలిటీలలో తీర్మానాలు, కోటి సంతకాల మహోద్యమం నేడు రాష్ట్రమంతా సాగుతోంది. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రధాన మంత్రికి ఇవ్వడానికిగాను కోటి సంతకాల ఉద్యమం మరింత ముమ్మరంగా సాగాలి.
   విశాఖ స్టీల్‌ను పోరాడి సాధించుకున్నాం. ఇది 32 మంది ప్రాణాల త్యాగఫలం. వేలాది మంది నిర్వాసితులు ఇళ్ళు, భూములు త్యాగం చేశారు. విశాఖ స్టీల్‌ను అమ్మరాదనే బలమైన సెంటిమెంట్‌ ప్రజల్లో ఉంది. సంతకాల సేకరణలో ఆ స్పందన కనిపిస్తున్నది. బిజెపి కార్యకర్తలు కూడా కింది స్థాయిలో సంతకాలు పెట్టడం విశేషం. బిజెపి రాష్ట్ర స్థాయి నాయకత్వం మైండ్‌ గేమ్‌ బెడిసికొట్టింది. నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఢిల్లీ నుంచి బిజెపి నాయకులు ప్రకటనలు చేశారు. ప్రైవేట్‌ అయితే ఉద్యోగాలు పోవని, స్టీల్‌ ప్లాంట్‌ ఎక్కడికీ పోదని, ఆరు నూరయినా వైజాగ్‌ స్టీల్‌ను ప్రైవేట్‌కు అమ్ముతామని పార్లమెంట్‌ నుంచి ప్రకటనలు చేశారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. బిజెపి అబద్ధాలతో ప్రజలను నమ్మించలేకపోయింది.
    విశాఖ స్టీల్‌ను దక్షిణ కొరియాకు చెందిన స్టీల్‌ దిగ్గజం 'పోస్కో'కు కట్టబెట్టాలన్నది బిజెపి కుట్ర. కడపలో స్టీల్‌ప్లాంట్‌ పెట్టమని పోస్కో కంపెనీని ముఖ్యమంత్రి స్వయంగా కోరినా పోస్కో తిరస్కరించింది. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను మాత్రమే కావాలంటున్నది. పోస్కో ప్రపంచంలోనే అత్యధిక రోబోట్లను వాడే కంపెనీ. విశాఖ స్టీల్‌ సాలీనా 60 లక్షల టన్నుల ఉత్పత్తికి 32 వేల మంది పని చేస్తున్నారు. కాని పోస్కో కంపెనీలో 200 లక్షల టన్నుల ఉత్పత్తికి 4 వేల మంది మాత్రమే పని చేస్తున్నారు. 'పోస్కో వస్తే ఉద్యోగాలు పోవు' అంటే నమ్మసాధ్యమేనా? విదేశాల నుంచి ప్రైవేట్‌ కంపెనీలు ఎందుకు వస్తాయి? లాభాల కోసమే వస్తాయి. మన దేశాన్ని ఉద్ధరించడానికి మాత్రం రావు. అందుకే బిజెపి వారి మాయమాటలు ఏమాత్రం నమ్మనక్కరలేదు. రాష్ట్రం విడిపోయిన తరువాత కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర ద్రోహం చేసింది. రాష్ట్ర విభజన చట్టం లోని కడప స్టీల్‌, రామాయపట్నం పోర్టు, విశాఖ రైల్వే జోన్‌, పోలవరం, రాజధానికి నిధులు, ప్రత్యేక హోదాని తుంగలో తొక్కింది. ఉన్న ఏకైక భారీ పరిశ్రమ విశాఖ స్టీల్‌ను ప్రైవేట్‌కు చౌకగా అమ్మడం ద్రోహం. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి.
   విశాఖ స్టీల్‌ అమ్మకానికి వ్యతిరేకంగా సంవత్సర కాలం సాగిన పోరాటం ఆదర్శనీయం. దేశం లోనే ప్రైవేట్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో ఉన్నతమైనది. ఢిల్లీ చుట్టూ మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ ఉద్యమం కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి మూడు నల్ల చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకునే విధంగా చేసింది. ఇదే మనకు స్ఫూర్తిదాయకం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు స్వంత గనులు సమకూర్చాలి. 'విశాఖ స్టీల్‌ను అమ్మం' అని కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రకటించే వరకూ ఈ ఉద్యమం కొనసాగుతుంది. మన లక్ష్యం సాధించడానికి పోరాటం ఒక్కటే మార్గం.

/ వ్యాసకర్త : విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌ /
సిహెచ్‌. నరసింగరావు

సిహెచ్‌. నరసింగరావు