Jul 12,2021 17:30

విశాఖ : విశాఖ ఉక్కు రక్షణకై ఆగస్టు 2,3 తేదీల్లో చలో పార్లమెంట్ జయప్రదం చేయండి అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును అమ్మకాన్ని వేగవంతం చేసిన తరుణంలో ఈరోజు ఉక్కు నగరంలోని సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణా పోరాట కమిటీ చైర్మన్ సి హెచ్ నర్సింగరావు, మంత్రి రాజశేఖర్, డి ఆదినారాయణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు అమ్మకం లో భాగంగా ట్రాన్జాక్షన్ అడ్వైజర్, లీగల్ అడ్వైజర్ నియామకాల కోసం టెండర్లలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిందని వారన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ రెండు ఉత్తరాలను అలాగే అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపారని వారు గుర్తు చేశారు. గడిచిన పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు తమ నిరసన గళం విప్పినా కేంద్రం పట్టించుకోవడంలేదని వారు వివరించారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యక్ష ఆందోళన తప్ప వేరొక మార్గము లేదని వారు స్పష్టం చేశారు. దీనిలో భాగమే ఆగస్టు 2,3 తేదీల్లో ఢిల్లీలో పార్లమెంట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని వారు అన్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పక్షాలు తమ నిరసన గళాన్ని పార్లమెంట్ లోపల బయట ఈ పోరాటానికి మద్దతు పలకాలని వారు అభ్యర్థించారు.

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ జె అయోధ్య రామ్, కో కన్వీనర్ గంధం వెంకట్రావు, కె. సత్యనారాయణ రావు మాట్లాడుతూ ఈ పోరాటంలో భాగంగా ఇప్పటికే పార్లమెంటరీ పార్టీల ఫ్లోర్ లీడర్స్ కి కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుపై చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ వారి మద్దతు కోసం లేఖలు రాశామని వారు అన్నారు. ఈ లేఖల సారాంశాన్ని ప్రత్యక్షంగా వారికి వివరించి మద్దతు కూడగట్టడం కోసం ఈనెల 20వ తారీఖున ఒక ప్రతినిధి బృందం ఢిల్లీ చేరుకుని వారి మద్దతును అభ్యర్థి ఇస్తారని వారన్నారు. ఆంధ్రుడి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా కేంద్రం చర్యలు చేపడుతోందని వారు తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతానని గద్దెనెక్కిన బిజెపి ప్రభుత్వం వాటిని కాలరాసే విధంగా తన నిజమైన వైఖరిని ప్రదర్శిస్తోంది అని వారు వివరించారు. కనుక ఇప్పటికైనా ప్రజా పోరాటాలను గౌరవిస్తూ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కనుక ఈ పోరాటంలో ప్రతి ఒక్క స్టీల్ కార్మికుడు తమ పోరాట పటిమను ప్రదర్శించింవలసిన సమయం ఆసన్నమైందని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విశాఖ ఉక్కు పరిరక్షణా పోరాట కమిటీ సభ్యులు వైటి దాస్, జె సింహాచలం, మురళి రాజు, నీరుకొండ రామచంద్ర రావు, మసేన్ రావు, దొమ్మేటి అప్పారావు, వై.మస్తానప్ప, దాలినాయుడు, బొడ్డు పైడిరాజు, వరసాల శ్రీనివాస్, విళ్ళ రామోహన్ కుమార్, సిహెచ్ సన్యాసిరావు, డి సురేష్ బాబు, కామేశ్వరరావు, అప్పలరాజు, జి ఆర్ కె నాయుడు, మహాలక్ష్మి నాయుడు, పి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.