జమ్మలమడుగు/ రూరల్ కడప జిల్లా ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉక్కుకర్మాగారం ఏర్పాటుకు పునాది పడనుంది. ఉక్కు పరిశ్రమపై జిల్లా నిరుద్యోగ యువత పెట్టుకున్న ఆశలు సాకారం కానుంది. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి గత ఏడాది డిసెంబర్ విజయవాడలో నిర్వహించిన ఓ సమావేశంలో జిందాల్ (జెఎస్‌డబ్ల్యు స్టీల్ లిమిటెడ్) ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రటించారు. అందుకు రూ. 8,800 నిధులు కూడా కేటాయించారు. ఎన్నికల హామీలలో భాగంగా మూడేళ్లల్లో కడప ఉక్కు పరిశ్రమను పూర్తి చేస్తామని బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2019లో శంకుస్థాపన చేశారు. తరువాత పనులు ప్రారంభించలేదు. ఎట్టకేలకు ఈనెల 15న సిఎం చేతుల మీదుగా ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభించనుండడంతో జిల్లా వాసుల్లో ఆశలు చిగురించాయి.
ముఖ్యమంత్రి ్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా వాసి కావడంతో తన తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కలను సాకారం చేయడంలో ముందు ఉంటారని అందరూ భావించారు. 2019 ఎన్నికల హామీల్లో భాగంగా వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదే ఏడాది ఆయన డిసెంబర్ 26న ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఆనాటి నుండి నేటి వరకు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి. దీంతో కడప జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి నెలకొంది. దాదాపు మూడేళ్ల తరువాత 2022 డిసెంబర్ 12న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర పెట్టుబడిల ప్రోత్సాహక మండలి సమావేశంలో కడప జిల్లా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు జెఎస్‌డబ్ల్యు స్టీల్ లిమిటెడ్‌ను ఒప్పించి స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. 2019లో రాష్ట్ర బడ్జెట్లో జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రూ .250 కోట్లు నిధులను కేటాయించారు. మొదటి బడ్జెట్ లోనే కడప ఉక్కు పరిశ్రమను ప్రస్తావించడంతో జిల్లా ప్రజలు, నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఆ నిధులతో కేవలం భూ సేకరణ పనులు మాత్రమే చేపట్టారు. మూడేళ్లయినా స్టీల్‌ప్లాంట్ పనులు ముందుకు సాగక పోవడంతో నిరుద్యోగులలో నిరాశ నిస్పహ నెలకొంది. 2007 జూన్ 10న అప్పటి ముఖ్యమంత్రి, కీ.శే.వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ జమ్మలమడుగు ప్రాంతంలోని చిట్టిమీట చింతల సమీపంలో నిర్మాణం చేపట్టారు. అప్పటి ప్రభుత్వం బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ కోసం 10 వేల ఎకరాల భూమిని సేకరించింది. ఎయిర్ పోర్టు నిర్మాణానికి మరో 3200 ఎకరాలనూ కేటాయించింది. బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ పనులు దాదాపు 40 శాతం పనులు కూడా పూర్తి అయ్యాయి. బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ యజమాని గాలి జనార్దన్ రెడ్డి జైలుపాలు కావడంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అప్పటి నుంచి జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఏ ముఖ్యమంత్రి ప్రయత్నం చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ అలాంటి ప్రయత్నమే చేయలేదు. వై.ఎస్. కాంగ్రెస్ పార్టీ 2019లో ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మళ్లీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. జిల్లాలో చదువుకున్న ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావించారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగా 20 వేల మందికి ఉపాధి, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఈనెల 15న మండల పరిధిలోని కన్యతీర్థం సమీపంలో జిందాల్ ఆధ్వర్యంలో సిఎం ప్రారంభించబోయే పనులు సకాలంలో పూర్తయి నిరుద్యోగుల ఆశలు నెరవేరుతాయో లేదో వేచి చూడాలి.
ఏర్పాట్ల పనులు ముమ్మరం
ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించబోయే స్టీల్ ఫ్లాంట్ భూమి పూజకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో కేవలం 500 మందితో భూమి పూజ చేపడతున్నారని తెలుస్తోంది. ఆ మేరకు జర్మన్ హ్యాంగర్ అనే కొత్త డాబాను ఏర్పాటు చేశారు. మరో వైపు స్టీల్‌ప్లాంట్ కోసం డికెటి భూములు కొనుగోలు చేసిన వారికి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని బాధితులు కోరుతున్నారు. స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగ అవకాశాల్లో భూములు ఇచ్చిన సిరిగేపల్లి, పెద్దదండ్లూరు, సున్నపురాళ్లపల్లె గ్రామస్తులతోపాటు స్థానికులకే మొదటి ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు.










