ప్రజాశక్తి - బాపట్ల, బాపట్ల రూరల్ (గుంటూరు జిల్లా) : జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో రాజౌరి జిల్లాలోని సుందర్‌బాని సెక్టార్‌లో బుధవారం జరిగిన కాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాదకొత్తపాలేనికి చెందిన జవాను మరుప్రోలు జస్వంత్‌రెడ్డి (24) మరణించాడు. 1997 నవంబర్ 17న రైతు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వరమ్మ దంపతులకు మొదటి సంతానంగా జన్మించిన జశ్వంత్‌రెడ్డి 2015లో 17 మద్రాసు రెజిమెంట్‌లో జవానుగా చేరాడు. 2016లో శిక్షణ పూర్తి చేసుకుని నీలగిరిలో విధుల్లో చేరాడు. అనంతరం జమ్ము కాశ్మీర్‌కు వెళ్లాడు. ఈనెల 5న తన బాబాయి కుమార్తె వివాహానికి జశ్వంత్‌రెడ్డి రావాల్సి ఉన్నా సెలవులు దొరక్క రాలేకపోకయాడని, ఇంతలో దారుణం చోటు చేసుకుందని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. జశ్వంత్‌రెడ్డి మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జశ్వంత్‌రెడ్డి భౌతికకాయం శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు సింకింద్రాబాదుకు చేరుకుంది. అక్కడి నుండి ఆర్మీ వాహనంలో రోడ్డు మార్గం ద్వారా స్వగ్రామానికి తీసుకువస్తున్నట్లు ఆయన కుటుంబీకులకు అర్మీ అధికారులు సమాచారం ఇచ్చారు. శనివారం ఉదయం దరివాదకొత్తపాలెంలోని శ్మశానవాటికలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
రూ.50 లక్షల సాయం
జశ్వంత్‌రెడ్డి వీరమరణం పొందడంపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. జశ్వంత్‌రెడ్డి త్యాగం మరువలేనిదని అన్నారు.










