Mar 05,2023 22:19

జగనన్న కాలనీలో దిష్టి బొమ్మల్లా దర్శనం ఇస్తున్న పునాదులు

ప్రజాశక్తి-హిందూపురం : ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా... అధికారులు మారినా పేదల సొంతింటి కల మాత్రం నేరవేరడం లేదు. హిందూపురం పురపాలక సంఘంలో గత 15 సంవత్సరాలుగా పేదల సొంతింటి కల కలగానే మిగులుతోంది. వీరితో పాటు గత పట్టణంలో వివిధ పత్రికల్లో, చానల్స్‌ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు సైతం సొంతింటి కల కలగానే మిగిలింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు పథకం లక్ష్య సాధనలో వెనుకంజలో ఉంది. ఉగాది నాటికి రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గృహ ప్రవేశాలు చేపడతామని అధికార యంత్రాంగం ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే.ఉగాది నాటికి 15,450 ఇళ్లు పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా ప్రస్తుతం 6, 824 మాత్రమే పూర్తయ్యాయి. లక్ష్యంలో కనీసం 50 శాతం సైతం పూర్తి చేయలేక పోయారు. గడువు తేదీ నాటికి శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా 15, 450 ఇళ్లు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. సిఎం జగన్మోహన్‌ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని గతేడాది డిసెంబరులో గృహప్రవేశాలు చేయాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలు గణనీయంగా పెరగడం, ఇసుక కొరత, ప్రజల్లో కొనుగోలు శక్తి లేకపోవటం వంటి కారణాలు వేధించాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉగాది నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికి సకాలంలో బిల్లులు మంజూరు కాక పోవడం, ఇసుక పూర్తి స్థాయిలో లభ్యం కాక పోవడం లాంటి సమస్యలు వెంటాడాయి. హిందూపురం పట్టణంలో 5712 మందిని తొలి విడత ఎంపిక చేశారు. ఇందులో 784 మంది మొదటి, రెండవ ఆప్షన్ల కింద ఇంటి నిర్మాణలను చేపట్టారు. మిగిలిన 4928 మంది లబ్దిదారులు ప్రభుత్వమే ఇంటిని నిర్మాణం చేసి ఇవ్వాలని కోరారు. దీంతో ప్రభుత్వం బెంగళూరుకు చెందిన న్యూస్‌ ఎజెన్సీకి పనులను అప్పగించింది. వారు గత రెండు సంవత్సరాలుగా కేవలం పునాదులు వేస్తున్నారే తప్ప ఇంటి నిర్మాణాలు పనులు ఇప్పటికి ప్రారంభించలేదు. విద్యుత్‌ శాఖ అధికారులు ఒక పక్క విద్యుత్‌ సరఫరాకు స్తంభాలు నాటారు. ఇప్పటికీ వైరు లాగలేదు. నీటి సౌకర్యాన్ని సైతం ఏర్పాటు చేయలేక పోయారు. దీంతో సొంతంగా నిర్మాణం చేసుకునే వారికి ఇసుకతో పాటు నీరు సైతం అక్కడ దొరక్క ఇబ్బందులతో నిర్మాణాలు వేగవంతంగా జరపడం లేదు. దీంతో పురపాలక సంఘంలో కనీసం వంద గృహాలు పునాదులకే పరిమితం అయ్యాయి.
జిల్లాలో 62716 ఇళ్ల స్థలాలు మంజూరు
పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా గృహ నిర్మాణానికి ప్రాధాన్య మిచ్చింది. జిల్లావ్యాప్తంగా జగనన్న కాలనీ లేఅవుట్లను ఏర్పాటు చేసింది. మొత్తం 62716 మందికి ఇళ్ల పట్టాలను అందించింది. గృహనిర్మాణం కింద ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు కేటాయించినట్టు ప్రకటించింది. నివాసయోగ్యం కాని ప్రాంతాలైన కొండలు, గుట్టలు, ఊరికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో లేఅవుట్లు కేటాయించడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనికితోడు పట్టణాల్లో ఒక సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలం కేటాయించడంతో ఎక్కువ మందిలో ఆశలు నీరుగారిపోయాయి. కొన్ని చోట్ల లేఅవుట్లు కేటాయించి రెండేళ్లు దాటుతున్నా వాటిలో మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదు. దీంతో నిర్మాణాలకు లబ్ధిదారులు విముఖత చూపారు. దీంతో అధికారులు ఒత్తిడి చేసి ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఇప్పుడిప్పుడే మౌలిక వసతులు
లేఅవుట్లలో మౌలిక వసతులు ఇప్పుడిపుడే కల్పిస్తున్నారు. ప్రధానంగా ఇసుక లభ్యత లేకపోడం కూడా ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. ఇసుక విషయంలో ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. దాని ప్రభావం ఇళ్ల నిర్మాణంపై పడుతోంది. కాలనీల్లో రోడ్లు, కాలువల నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్‌ విభాగానికి అప్పగించారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ బోర్ల తవ్వకాలపై దృష్టిపెట్టింది. విద్యుత్‌ శాఖ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేసే పనిలో పడింది. ఇలా మౌలిక వసతులు కల్పించక ముందే ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరుతుండడంతో చాలామంది లబ్ధిదారులు విముఖత చూపుతున్నారు. జిల్లాలో వేలాది మంది లబ్ధిదారులు ఇప్పటికీ తమ నిర్మాణాలకు పునాదులు కూడా వేయలేదు.
జిల్లాలో పూర్తి అయినవి 1974 గృహాలే
శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా 62, 716 మందికి ఇళ్ల స్థలాలను కేటాయించారు. అయితే ఇప్పటి వరకు పూర్తి చేసినవి 1974 మాత్రమే అని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ నెల 22న ఉగాది నాటికి 15,450 గృహ ప్రవేశాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే వివిధ దశలో 6824 గృహాలున్నాయి. ఇంకా 8626 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉంది. ఈ లెక్కన రోజుకు సుమారు 432 ఇండ్లు పూర్తి చేస్తే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంతో గృహప్రవేశాలు జరుగుతాయి. లేదంటే గత టిడిపి ప్రభుత్వంలో గోడలు కట్టి గృహ ప్రవేశాలు చేసినట్లు చేయాల్సి ఉంటుంది.