Jan 05,2023 22:18

విడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : నవరత్నాలలో భాగంగా జగనన్న ఇల్లు నిర్మాణాలు ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని చీఫ్‌ సెక్రటరీ డాక్టరు జవహర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం వెలగపూడి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు సంయుక్త కలెక్టర్లతో రెవిన్యూ, రీ సర్వే, వ్యవసాయం, హార్టికల్చర్‌, గహ నిర్మాణం, వివిధ ప్రభుత్వ పథకాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌ లో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌, డిఆర్‌ఒ కొండయ్య వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవహర్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గృహ నిర్మాణాలు 5 లక్షలు పూర్తి చేయాలన్నారు. రబీ సీజను ఈ క్రాప్‌ బుకింగ్‌ గడువులోగా వంద శాతం పూర్తి చేయాలన్నారు. పిఎం కిసాన్‌ పథకం క్రింద అర్హులైన రైతుల ఈకేవైసీ చేయించాలన్నారు. మైక్రో ఇరిగేషన్‌ లో భాగంగా అర్హులైన వారిని ఎంపిక చేసి ఆ మేరకు పూర్తి లక్ష్యం సాధించాలన్నారు. వైఎస్‌ఆర్‌ చేయూత పథకం క్రింద జీవనోపాధి కోసం స్వయం సహాయక సంఘాల మహిళల కు రుణాలు ఇప్పించాలన్నారు. జాతీయ రహదారుల పనికి సంబంధించి భూ సేకరణ పూర్తి చేయాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వంలో మంజూరైన పనులు పూర్తిస్థాయిలో పూర్తి చేయాలన్నారు. కలెక్టరు బసంత్‌ కుమార్‌ మాట్లాడుతూ పథకాలన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఒ విజరు కుమార్‌, సర్వే ల్యాండ్స్‌ రికార్డ్స్‌ అధికారి రామకృష్ణ, డిఇఒ మీనాక్షి, పిఆర్‌ఎస్‌ఇ గోపాల్‌ రెడ్డి, డిఎంహెచ్‌ఒ కృష్ణారెడ్డి, డ్వామా పీడీ రామాంజనేయులు, వ్యవసాయ అధికారి సుబ్బారావు, పట్టు పరిశ్రమ జెడి పద్మమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.