Feb 17,2023 20:08

సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

ప్రజాశక్తి-రాయచోటి : ప్రభుత్వ సేవలను ప్రజలకు నిర్దేశించిన సమయంలో అందించేలా సచివాలయ ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వహించాలని కలెక్టర్‌ గిరీష్‌ ఆదేశించారు. శుక్రవారం రాయచోటి పురపాలక సంఘం ఎస్‌ఎన్‌ కాలనీ 14వ వార్డులోని వార్డు సచివాలయం-9ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల కేలండర్‌, సచివాలయ సిబ్బంది రిజిస్టర్లు, పలు రికార్డులను తనిఖీ చేశారు. టాక్స్‌ కలెక్ట్‌, ఆయుష్మాన్‌ భారత్‌, 90 డేస్‌ పట్టాస్‌, వాటర్‌ సప్లై, శానిటేషన్‌, ఇంటింటికి చెత్త సేకరణ పై వివరాలు అడిగి తెలుసుకుని సచివాలయ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. శానిటేషన్‌, ఇంటింటికి చెత్త సేకరణ పక్కాగా జరగాలన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద జగనన్న కాలనీలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందించే విధముగా సచివాలయ సిబ్బంది కృషి చేయాలన్నారు. సచివాలయం వచ్చే ప్రజలతో సిబ్బంది గౌరవంగా వ్యవహరించి తమ పరిధిలో ఉన్న సేవలను అందించాలన్నారు. సచివాలయ సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల నుంచి వచ్చే అర్జీలను తక్షణమే పరిష్కరించాలన్నారు. కలెక్టర్‌ వెంట రాయచోటి పురపాలక సంఘం కమిషనర్‌ రాంబాబు, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.