పుట్టపర్తి రూరల్ :శ్రీ సత్య సాయి జిల్లాలో పనిచేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను కలెక్టర్ బసంత్‌కుమార్‌కు, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి విన్నవించారు. ఈ మేరకు వారు బుధవారం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ బసంత్‌కుమార్‌కు అందజేశారు. అంతకుమునుపు శ్రీ సత్య సాయి జిల్లా తొలి సమావేశం జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారిక అధికారిని జిల్లా సమావేశ మందిరంలో నిర్వహించారు. కొత్తగా జిల్లా ఏర్పడి ఉద్యోగులు మధ్యంతరంగా బదిలీ కావటం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు. ఉద్యోగులు ఎక్కువ శాతం అనంతపురం జిల్లా కేంద్రం నుండి పుట్టపర్తికి వస్తున్నారని వారికి అనుకూలంగా ధర్మవరం నుండి విజయవాడ వెళేల రైలును పుట్టపర్తి వరకు పొడిగించేందుకు ప్రభుత్వం అనుమతులు తీసుకోవాలని కోరారు. అలాగే సచివాలయ ఉద్యోగుల ప్రొహిబిషన్, ఎఎన్‌ఎంల సమస్యలను చర్చించారు. పనిభారం ఎక్కువగా ఉందని ఈ నేపథ్యలో రెండవ శనివారం సెలవు గురించి ఆలోచించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయానికి స్థలం కేటాయించాలని కోరారు. ఈ సమస్యల పట్ల కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. అనంతరం ఉద్యోగులు స్థానిక ఎమ్మెల్యేను కలసి తమ సమస్యలను విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎపిజిఎ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, కోశాధికారి కెవి నారాయణరెడ్డి, రమేష్ బాబు, చెన్నారెడ్డి, వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










