Jan 07,2023 21:44

ఫొటో : మాట్లాడుతున్న పిడిఎఫ్‌ గ్రాడ్యుయేట్‌ ఎంఎల్‌సి అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డి

ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లించాలి
ప్రజాశక్తి-సీతారామపురం : రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్లు తీసుకునే వారికి సకాలంలో జీతాలు చెల్లించాలని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల పిడిఎఫ్‌ గ్రాడ్యుయేట్‌ ఎంఎల్‌సి అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలలను సందర్శించి తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం యుటిఎఫ్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. నెల ప్రారంభమై వారం ముగుస్తున్నా.. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్‌దారులకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అసమర్థత విధానాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఒకటవ తేదీన జీతాలు పొందలేకపోతున్నారని, ప్రభుత్వ ఉద్యోగుల పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ, సిపిఎస్‌ నగదు ప్రభుత్వ అవసరాలకు వాడుకుని, సుమారు రూ.2000 కోట్ల పిఎఫ్‌ బిల్లులు పెండింగ్‌లో ఉంచిందన్నారు. ఉద్యోగులు కట్టే సిపిఎస్‌ నగదు డబ్ల్యూ ఎస్‌డిఎల్‌ సంస్థకు కట్టకుండా ప్రభుత్వ అవసరాలకు వాడుకోవడాన్ని ఆయన ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వ అధికారుల అనాలోచిత నిర్ణయాల వలన ప్రస్తుతం ప్రమోషన్లు బదిలీలు కోర్టు కేసుల్లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 50 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయకుండా నిరుద్యోగులతో ప్రభుత్వం ఆటలాడుతుందన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఎస్‌ను రద్దు చేస్తానని హామీనిచ్చి ప్రస్తుతం అమలుకు వీలు కాదంటూ మాట తప్పడం దారుణమన్నారు. కెజిబిలలో పనిచేస్తున్న పార్ట్‌ టైం, ఇన్‌స్ట్రక్టర్లకు కనీస పని వేళలు కల్పించాలని, మహిళా వార్డెన్లను నియమించాలని పోరాడుతానన్నారు. ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత వేసి గెలిపిస్తే శాసనమండలిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతానని తెలియజేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గొడ్లవేటి.వెంకటేశ్వర్లు, సిహెచ్‌.ప్రతాప్‌, జిల్లా కార్యదర్శి ఎడమ తిరుపతయ్య, భోగ్యం శ్రీనివాసులు, సిహెచ్‌.రవీంద్ర రెడ్డి, బి.జయరామిరెడ్డి, రంతుజాని, తదితరులు పాల్గొన్నారు.