Dec 04,2022 22:07

కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవనం

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : కరువుకు నిలయమైన ఉమ్మడి అనంతపురం జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో కంపెనీలు లేకపోవటంతో ఉన్నత చదువులు చదివి ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్‌, డిగ్రీ చదువులు చదివి ఉద్యోగాలు కోసం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, వంటి నగరాలకు ఉద్యోగం కోసం ఎంతోమంది యువతి యువకులు వెళ్తున్న దుస్థితి. ఇలాంటి పరిస్థితులలో కదిరి పట్టణంలో మదనపల్లి రోడ్డులో ఎటిడి, బైపాస్‌ రోడ్‌ గర్ల్స్‌కాలేజ్‌ ఎదుట విట్రాక్‌వర్డ్ల్‌, ఎమ్‌ఎన్‌సి కంపెనీలు నడుపుతున్నారు. అయితే ఆ రెండు కంపెనీలు అనుమతులు లేకుండా ఎలాంటి నిబంధనలు పాటించకుండా నడుపుతున్నట్లు సమాచారం. విట్రాక్‌ రెండు సంవత్సరాల పై బడి , మరొక కంపెనీ అయిన ఎటిడి 6 నెలలుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నా కంపెనీ కొనసాగిస్తున్నట్లు ఇంతవరకు తన దృష్టికి రాలేదని సహాయ కార్మిక అధికారి చెప్పడం విడ్డూరంగా ఉంది. ఈ రెండు సంస్థల్లో దాదాపు 90మంది యువతీ యువకులు పని చేస్తున్నారు. సంస్థలో పనిచేస్తున్న వారందరికీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు సంస్థలు ఫారం ఇవ్వకుండా, కార్మిక శాఖ నిబంధన మేరకు కనీస వేతనచట్టాన్ని అమలు చేయకుండా శ్రమ దోపిడీ చేస్తున్నాయన్న విమర్శలున్నాయి. 3 నెలలు లేక,100 రోజులు లోపు గాని ప్రయివేటు యాజమాన్యం కింద పని చేస్తే ఆ సిబ్బందికి నిబంధల ప్రకారం వారికి ఫారం ఎస్‌ను అందజేయాలి. చట్టం ప్రకారం కనీస వేతనం 18వేల రూపాయలతో పాటు, సంస్థ ఆదాయంలో సిబ్బందికి ప్రావిడెంట్‌ ఫండ్‌ కొరకు కొంచెం చెల్లించి, సిబ్బంది వేతనంలో కొంత నగదును ప్రావిడెంట్‌ ఫండ్‌ రూపంలో కట్టాలి. అలాగే సిబ్బందికి పిఎఫ్‌, ఇపిఎఫ్‌, జిపిఎఫ్‌ చెల్లించాలి. ఇందుకుగాను ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ చెల్లించాలి, ఏదైనా ప్రైవేటు సంస్థ సిబ్బందికి సంవత్సరానికి ఒక సారి బోనస్‌ చెల్లించాలి. వేతనం ఇచ్చే సమయంలో అక్విటీన్స్‌ రిజిస్టర్‌ లో సంతకాలు తీసుకోవాలి, పేస్లిప్‌ ఇవ్వాలి. పైగా ఉద్యోగికి చేతికి ద్వారా కాకుండా బ్యాంకు నుండి వేతనాలు చెల్లించాలి. ఈ నిబంధనలను తప్పనిసరి పాటించాలి. కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించే సమయంలో ఉద్యోగి వాహనాల పార్కింగ్‌ స్థలం. కంపెనీ కార్యకలాపాలకు వెయ్యి గజాల స్థలం తప్పనిసరిగా ఉండాలి. కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన అనుమతులు పత్రాలు కార్మిక శాఖ అధికారికి సమర్పించాలి. స్థానిక సహాయ కార్మిక అధికారి సంస్థ కార్యకలాపాలు కొనసాగించే భవనంతో పాటు సిబ్బంది కొరకు కనీస మౌలిక వసతులను పరిశీలించాలి. సంస్థలు రిజిస్ట్రేషన్‌ నమోదు తప్పనిసరి చేయించాలి. సంవత్సరానికి ఒకసారి సంక్షేమ నిధి కార్మికుల పేరుతో కట్టించుకోవాలి. వీటిలో ఏమైనా లోపాలుంటే యాజమాన్యాన్ని హెచ్చరించాలి. లేదా సమస్య తీవ్రతను బట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలి. అయితే ఇక్కడ ఇవేవీ జరగడం లేదు. కార్మికులకు చాలీచాలని వేతనాలిస్తూ అధికవేతనాలు ఇస్తున్నట్లు తప్పుడు లెక్కలు చూపిస్తూ మూడు సంవత్సరాలుగా సిబ్బంది శ్రమను దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే కదిరిలో సహాయ కార్మిక శాఖ అధికారి ఉన్నట్టా లేనట్టా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కార్మికుల కడుపుకొట్టడంలో యాజమాన్యానికి సహాయ కార్మిక అధికారి సహకరిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనలు పాటించని కంపెనీల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు అరుణ్‌ కుమార్‌, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ అంశంపై తహశీల్దార్‌ కి ఫిర్యాదు చేస్తే అవినీతికి పాల్పడిన కంపెనీల యాజమాన్యం , సహాయ కార్మిక అధికారి పైన చర్యలు తీసుకోవాల్సింది పోయి రాయలసీమ విద్యార్ధి యువజన సంఘం నాయకులను బెదిరిస్తున్నారని నాయకులు విమర్శిస్తున్నారు. 'మీమీద కంపెనీ యాజమాన్యం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీరిక్కడే ఉండండి' అని బెదిరిస్తున్నారని విమర్శిస్తున్నారు.