Jan 09,2021 21:50

న్యూఢిల్లీ బ్యూరో : మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధ్దత కల్పించాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఉద్యమం మరింత ఉధృతమైంది. మరో వైపు రైతుల ఆందోళన 45వ రోజుకు చేరింది. సింఘు, టిక్రి, పల్వాల్‌, ఘాజీపూర్‌, నోయిడా, షాజహాన్‌ పూర్‌ సరిహద్దుల్లోనూ, బురారీ మైదానంలో రైతులు మొక్కవోని దీక్షతో నిరసన కొనసాగిస్తున్నారు. పంజాబ్‌ నుంచి మూడు వేల మంది వ్యవసాయ కార్మికులు వచ్చి టిక్రీ సరిహద్దు వద్ద ఆందోళనలోఉన్న రైతులకు మద్దతుగా నిలిచారు. సింఘూ సరిహద్దు వద్ద రైతు నేతల పోరాటానికి పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు చెందిన వందలాది మంది న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. షాజాహన్‌ పూర్‌ వద్ద ఆందోళనలో ఒరిస్సా నుంచి వచ్చి రైతులు భాగస్వాములయ్యారు. అన్ని ఆందోళన కేంద్రాల వద్ద రైతుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సామాజిక ఉద్యమకారిణి, రచయిత అరుంధతి రారు రైతులకు మద్దతు తెలిపారు. దేశవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో నిరవధిక నిరాహార దీక్షలు, రాష్ట్ర స్థాయి ర్యాలీలు జరిగాయి. రైతుల ఆందోళనకు మద్దతుగా ఈ నెల 15న దేశవ్యాప్తంగా అన్ని గవర్నర్‌ హౌస్‌ల ఎదుట నిరసనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది.
 

అంబాలాలో రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ
కార్పొరేట్‌ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ హర్యానాలోని అంబాలా వద్ద రైతులు శనివారం ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. అంబాలా-హిసార్‌ హైవే సమీపంలో ఉన్న ధాన్యం మార్కెట్‌ వద్ద రైతులు సమావేశమై, అక్కడ నుంచి అంబాలా కంటోన్మెంట్‌ వైపు ట్రాక్టర్స్‌ ర్యాలీ నిర్వహించారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి హర్బన్స్‌ సింగ్‌ మనక్పూర్‌ మాట్లాడుతూ, ఈ నెల 26న చేపట్టే కిసాన్‌ రిపబ్లిక్‌ పరేడ్‌కు ఇదొక రిహార్సల్‌ వంటిదన్నారు.

రైతుల మనో స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు మోడీ ప్రభుత్వం వేస్తున్న ఎత్తులను చిత్తు చేయడంలో మానసిక ఆరోగ్య నిపుణులు అన్నదాతకు బాసటగా నిలిచారు. దేనికైనా ఆత్మహత్య పరిష్కారం కాదని, పోరాటం ద్వారానే ఏదైనా సాధించవచ్చనే విశ్వాసాన్ని వారికి కల్పిస్తున్నారు. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని క్లినికల్‌ సైకాలజిస్ట్‌ సన్యా కటారియా చెప్పారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతుల పోరాట శిబిరాల వద్ద మురుగునీరు, బురద పేరుకుపోయింది. దోమల ఉత్పత్తి కేంద్రాలుగా ఇవి తయారు కాకుండా చూసేందుకు స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగి డెంగ్యూ నియంత్రణ రసాయనాలు పిచికారీ చేశాయి. మరోవైపు పోరాడుతున్న రైతులకు ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం ఉచిత వైఫై హాట్‌స్పాట్‌ సౌకర్యాన్ని కల్పించింది.
రైతుల పోరాటంపై జోక్యం చేసుకోండి

బోరిస్‌కు లేబర్‌ పార్టీ ఎంపీిల లేఖ
భారతదేశంలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా వంద మందికిపైగా బ్రిటన్‌ లేబర్‌ ఎంపీలు ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు ఒక లేఖ రాశారు. తన్మన్‌జీత్‌ సింగ్‌ ధేసీ నేతృత్వంలో ఈ ఎంపిల బృందం ఈ మేరకు సంయుక్తంగా ఒక లేఖ రాశారు. నిరసన తెలిపే హక్కు ప్రాముఖ్యతను పునరుద్ఘాటించాలని, ఈ విషయంలో కలుగజేసుకుని మోడీపై ఒత్తిడి తేవాలని వారు బోరిస్‌ను కోరారు. ధేసీ నేతృత్వంలో 36 మంది ఎంపిలు కామన్వెల్త్‌ కార్యదర్శి డొమినిక్‌ రాబ్‌క్‌ ఇదివరకే ఒక లేఖ రాశారు.