Jan 28,2023 21:31

ప్రజాదృష్టి

జిల్లా ఉద్యమబాట పట్టింది. 2014 రాష్ట్ర విభజన హక్కు చట్టంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే హామీ దఖలుపడిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో అధికారంలో వచ్చిన టిడిపి సర్కారు ఐదేళ్లూ చోద్యం చూసింది. అనంతరం ఎన్నికల ఏడాది జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరుతూ ధర్మపోరాటం పేరుతో ఆమరణ దీక్షల నాటకాన్ని రక్తికట్టించింది. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే మూడేళ్లలోపు ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీతో వైసిపి అధికా రంలోకి వచ్చింది. అనంతరం అదే ఏడాది డిసెంబర్‌ 23, 24వ తేదీల్లో ప్రయివేటు కంపెనీ సహకారంతో కలిసి ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని శంకుస్థాపనలు చేసింది. మూడున్నరేళ్లు అవుతున్నప్పటికీ వామపక్షాల ఆధ్వర్యంలో జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి శంకుస్థాపన రాతి దగ్గర నుంచి కలెక్టరేట్‌ వరకు వామపక్షాలు ఉద్యమం చేపట్టడంతో కదలిక వచ్చింది. చివరి ఏడాదిన్నర వ్యవధి ఉండగా వైసిపి అద్యక్షులు వైఎస్‌ జగన్‌ సొంత జిల్లాలో జిఎస్‌డబ్యూ కాంట్రాక్టు సంస్థ పేరుతో డిసెంబర్‌ చివరి వారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని పేర్కొనడం తెలిసిందే. చివరి వారం ముగుస్తు న్నప్పటికీ వాయిదాల మీద వాయిదాలు పడుతుండడంతో ప్రత్యేక హోదా సాధన సమితి, డివైఎఫ్‌ఐ, యువజన సంఘాల ఆధ్వర్యంలో చలసాని శ్రీనివాస్‌ సారధ్యంలో ప్రత్యేక హోదా సాధన సమరయాత్ర 2.0 పేరుతో ఉద్యమబాట పట్టడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కార్యక్ర మాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంకల్పంపై సందేహాలు వ్యక్తమవుతుండడం తెలిసిందే. ఇందుకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పనుల్ని వాయిదా వేస్తుండడమే నిదర్శనమని తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల ముంగిట అప్పటి టిడిపి సర్కారు సైతం ఆమరణ దీక్షలతో రక్తి కట్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాయిదాల వ్యవహారం గుర్తుకుతెస్తోంది. ప్రయివేటు ఉక్కు పరిశ్రమ బ్రహ్మణీ పరిశ్రమ తరహా మారకుండా చిత్తశుద్ధితో పనులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు. ఏదేమైనప్పటికీ జిల్లాలో సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా సామాజిక న్యాయం చేకూరు తుందని, తద్వారా జిల్లా సమగ్రా భివృద్ధి సాధ్యపడుతుందని చెప్పవచ్చు. ఇటువంటి ప్రయత్నానికి తిలోదకాలు ఇచ్చి ప్రయివేటు ద్వారా పరిశ్రమ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తూనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని, ఫలితంగా వందలాది అనుబంధ సంస్థలు రావడంతో జిల్లా నుంచి వెళ్తున్న వేలాది మంది నిరుద్యోగ వలసలు నివారించాలని కోరుతున్న వామపక్షాలు, యువజన సంఘాలు, అభ్యుదయ సంఘాల డిమాండ్‌ ఫలించాలని కోరుకుందాం.
ప్రజాశక్తి - కడప ప్రతినిధి