Sep 26,2023 21:53

ఫొటో : మాట్లాడుతున్న జిల్లా సాధన నాయకులు

ఉదయగిరి జిల్లాతోనే అభివృద్ధి
ప్రజాశక్తి-సీతారామపురం : జిల్లాలోనే మెట్ట ప్రాంతమైన ఉదయగిరి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఉదయగిరి జిల్లా కావాలని జిల్లా సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్‌ వేణుగోపాల్‌, ప్రధాన కార్యదర్శి దస్తగిరి అహ్మద్‌లు తెలిపారు. ఉదయగిరి జిల్లా సాధనకు సహకరించాలని సోమవారం సాయంత్రం సీతారామపురం మండలం పోలంగారిపల్లి గ్రామంలో ఉదయగిరి జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో నేతలు కోరారు. ఈ సందర్భంగా ఉదయగిరి జిల్లా సాధన కమిటీ అధ్యక్షులు డాక్టర్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ అనాదిగా ఉదయగిరి ప్రాంతం వెనుకబడి ఉందని ఇక్కడి ప్రాంత ప్రజల జీవన స్థితిగతులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. ఇక్కడి ప్రజల జీవన పరిస్థితులు బాగుపడాలంటే ఉదయగిరి జిల్లా సాధన ఒక్కటే మార్గమన్నారు.
ఉదయగిరి జిల్లా వస్తే అన్ని రకాల సదుపాయాలు వస్తాయని విద్య వైద్యం రవాణా సౌకర్యాలు ఉపాధి అవకాశాలు అన్ని మెరుగుపడి ప్రజల జీవితాలు బాగుపడతాయని తెలిపారు. అంతేకాకుండా గత నాలుగు సంవత్సరాలు నుండి ఉదయగిరి ప్రాంతంలో జిల్లా ఉద్యమాన్ని ప్రారంభించి ర్యాలీలు నిర్వహించడం, పోస్ట్‌ కార్డు ఉద్యమాన్ని నిర్వహించడం, నిరాహార దీక్షలు చేయడం, ప్రజాప్రతినిధులను కలిసి విజ్ఞాపన పత్రాలను అందించడం ప్రజలకు అవగాహన కల్పించి ఉదయగిరి జిల్లా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలబడి సపోర్టు చేయమని చెప్పినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరితో విజ్ఞాపన పత్రంపై సంతకాలు చేయించి ముఖ్యమంత్రికి పంపించడం జరిగిందిని, రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసేటప్పుడు మెట్ట ప్రాంతానికి అన్యాయం జరిగిందని, జిల్లాలు చెయ్యడం వల్ల మనకు ఏ విధంగా లాభం లేదని, మూడు జిల్లా కేంద్రాలైన నెల్లూరు, కడప, ప్రకాశం ఎటుచూసినా 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయగిరిని జిల్లా చేస్తేనే అన్నీ సమస్యలకు పరిష్కార మార్గమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి దస్తగిరి అహ్మద్‌, కార్యదర్శి షేక్‌.ఖాదర్‌ బాషా, పొలంగారిపల్లి సర్పంచ్‌ మత్తూరు వెంకటసుబ్బయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.