ఉద్యాన పంటలకు రైల్వేకోడూరు ప్రసిద్ధి.వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి
రైల్వేకోడూరు : రాష్ట్రంలో ఉద్యాన పంటలకు రైల్వేకోడూరు ప్రసిద్ధిగాంచిందని జిల్లా ఇన్‌ఛార్జి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం అనంతరాజుపేట హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన హార్టికల్చర్ పరిపాలన భవనం, పీజీ విద్యార్థుల హాస్టల్ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన కళాశాల శాస్త్రవేత్తలను తయారు చేస్తున్నదన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి స్థాపించిన ఈ కళాశాల ఎంతో అభివద్ధికి మారుపేరుగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో దాదాపు వందలాది మంది విద్యార్థులు శాస్త్రవేత్తలుగా తయారవుతున్నారని తెలిపారు. పాడిపంటలకు ప్రసిద్ధిగాంచిన రైల్వేకోడూరు ప్రాంతంలో పంటలకు వచ్చే తెగుళ్లను అరికట్టడంలో ఈ శాస్త్రవేత్తలు అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. రూ.14 కోట్లతో అద్భుతంగా భవనాలను నిర్మించారన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ పూర్తిస్థాయిలో ఈ చక్కటి వాతావరణంలో ఈ భవనాలను నిర్మించి విద్యార్థులకు కళాశాలకు మంచి పేరు వచ్చిందని పేర్కొన్నారు. చక్కటి విద్యకు పునాదిగా అనంతరాజుపేట హార్టికల్చరల్ కళాశాలగా పేరుగాంచిందని అన్నారు. అనంతరం రైల్వే కోడూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ అగ్రిటెస్టింగ్ ల్యాబ్‌ను మంత్రి ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటైన మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్దులూరు సుబ్బరామరాజు కమిటీ సభ్యులతో మంత్రి గోవర్ధన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, వైస్ ఎంపిపి ధ్వజారెడ్డి, అధికారులు, మిత్రులకు ఉపసర్పంచి తోట శివ సాయి గంగమ్మ జాతర సందర్భంగా విందు ఇచ్చారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, విసి జానకిరామ్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, అసోసియేట్ డీన్‌తోపాటు ఉద్యానవన కళాశాల సిబ్బంది వైసిపి స్టేట్ మెంబర్ హెమనవర్మ, టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, ఎంపిటిసి జనార్ధన్‌రాజు పాల్గొన్నారు.










