ఒక పెద్ద అడవి. ఆ అడవిలో మర్రిచెట్టు. దాని కిందనే పెద్ద ఊబి. ఒక తోడేలు కుందేలుపిల్లను తరుముకుంటూ వచ్చి, ఆ ఊబిలో పడిపోయింది. కుందేలు బతుకుజీవుడా అనుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోయింది.
తోడేలు ఆ ఊబి నుండి బయటపడడానికి విశ్వప్రయత్నం చేసింది. ప్రయత్నించే కొద్దీ, అది ఆ ఊబిలో మరింత లోతుకు కూరుకుపోతూ ఉంది. అప్పుడే ఒక కోతిబావ అటుగా వచ్చింది. అది చాలా మంచిది. అడిగినవారికి కాదనకుండా సాయం చేస్తుంది.
'కోతిబావ! కోతిబావ!! నేను ఈ ఊబిలో చిక్కుకున్నాను. ఎంత ప్రయత్నించినా బయటపడలేక పోతున్నాను. నువ్వే ఎలాగైనా నన్ను రక్షించు. నీకు జీవితాంతం ఋణపడి ఉంటాను!' అంటూ వేడుకుంది.
ఆపదలో ఉన్న తోడేలును చూడగానే కోతిబావాకు జాలి కలిగింది. మర్రిచెట్టు కొమ్మను ఆసరాగా చేసుకుని, తోడేలును కాపాడడానికి పథకం వేసింది. చెట్టు ఊడలను తెంపి, కొమ్మపై నుండి ఊబిలోకి వేలాడేసి, ఆ ఊడలను గట్టిగా పట్టుకోమని తోడేలుకు చెప్పింది. తన శక్తినంతటనీ ఉపయోగించి, తోడేలును పైకి లాగింది. ఎట్టకేలకు తోడేలు ఊబి నుండి బయటపడింది. తోడేలు అంతటితో ఆగకుండా కోతిని గట్టిగా పట్టుకుని 'నాకు చాలా ఆకలిగా ఉంది. నిన్ను తిని, నా ఆకలి తీర్చుకుంటాను!' అని చెప్పింది.
కోతి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. వెంటనే తేరుకుని, 'తోడేలు మామ! నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉంటే నేను నిన్ను రక్షించాను. నువ్వు ఆపద నుండి బయటపడగానే ఇలా నా ప్రాణాలు తీయాలని అనుకోవడం అన్యాయం!' అంటూ కన్నీరు పెట్టుకుంది.
'ఇప్పుడు నేను నిన్ను తినకపోతే ఆకలితో చచ్చిపోతాను. ఆకలితో ఉండగా మరో ప్రాణిని చంపి తినడం అన్యాయమేమీ కాదు!' అంటూ కోతిని మరింత గట్టిగా పట్టుకుంది.
అప్పుడే ఆ మర్రిచెట్టు కొమ్మపైకి ఒక ఉడుత వచ్చింది. కోతి జరిగినదంతా ఉడుతకు చెప్పి, న్యాయం అడిగింది. ఉడుత తోడేలు వైపుకు తిరిగి 'నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా?' అని అడిగింది.
'ఈ కోతి నాకు ఆసరాగా మర్రిచెట్టు ఊడలను అందించిన మాట వాస్తవమే! కానీ ఆ ఊడలను పట్టుకుని, నేను ఎంతో కష్టపడి ఊబి నుండి పైకి వచ్చాను. కానీ ఈ కోతి తానే నన్ను కాపాడినట్టు గొప్పలు చెప్పుకుని, నా నుండి తప్పించుకోవాలని చూస్తోంది!' అంటూ కోతిపై ఉడుతకు ఫిర్యాదు చేసింది తోడేలు.
'తోడేలు మామ అబద్ధం చెబుతోంది. అది ఊబిలో కదలలేని పరిస్థితిలో ఉంటే నేను ఎంతో కష్టపడి పైకి లాగాను!' మరోసారి చెప్పింది కోతి.
'నాకు నీ మాటలపై నమ్మకం కలగడం లేదు. తోడేలు మామను నువ్వు పైకి లాగేటప్పుడు నేను చూడలేదు. కనుక మరొక్కసారి నువ్వు తోడేలు మామను లాగి, చూపించు' అని అడిగింది ఉడుత.
కోతి సరేనని ఒప్పుకుంది. 'తోడేలు మామ! ఈ కోతిబావ అబద్ధాలాడుతున్నాడని నాకు తెలుసు. అయినప్పటికీ ఒక పెద్దమనిషిగా నేను నిజానిజాలను తెలుసుకోవాలి. జరిగినదంతా మరొక్కమారు ప్రత్యక్షంగా చూడాలి. కనుక నువ్వు ఊబిలోకి దూకు. ఈ కోతి నిన్ను కాపాడగలదేమో! చూద్దాం!!' అంటూ ఉడుత తెలివిగా అడిగింది.
ఉడుత తన పక్షానే ఉందని నమ్మిన తోడేలు అది చెప్పినట్టే ఊబిలోకి దూకింది. కోతి తన నిజాయితీని నిరూపించుకోవడానికి తోడేలును రక్షించే ప్రయత్నం చేయబోయింది.
ఉడుత కోతిబావాను సున్నితంగా వారించింది.
'చెట్టు పైనుండి నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను. నువ్వు ఎంతో కష్టపడి తన ప్రాణాలు కాపాడావన్న కృతజ్ఞత కూడా లేకుండా ఆ మోసకారి తోడేలు నిన్ను చంపబోయింది. అలాంటి వారి కోసం మనం మన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఆ ఊబిలోనే చావనివ్వు!' అంటూ కోతిని అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోయింది.
తోడేలు నిజస్వరూపం తెలిసిన మరే ఇతర జంతువూ దాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. తోడేలు తన తప్పును తెలుసుకున్నప్పటికీ ఆ ఊబి నుండి బయటపడలేక పోయింది.
పేట యుగంధర్
94925 71731