మూడో తరగతి చదివే హేమకు ఆటలు అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఏదో వంకతో బడి మానేసి, ఇంటి దగ్గర ఆటలు ఆడుతూ ఉంటుంది. రెండో శనివారం, ఆదివారం - తర్వాత సోమవారం రానే వచ్చింది. పొద్దున్నే బడికి వెళ్లాలి. రెండు రోజులు సెలవుల్లో హాయిగా గడిపిందేమో సోమవారం బడికి వెళ్లబుద్ధి కాలేదు హేమకు. కడుపు నొప్పిగా ఉంది అంటూ మొదలెట్టింది. మొత్తం మీద బడి ఎగ్గొట్టేసింది.
బడికి వెళ్లే సమయం అయిపోయాక మెల్లగా మంచం దిగింది హేమ. ఇంటి వెనుక పెరట్లోకి వెళ్లింది. చెట్టు దగ్గరకు వెళ్లి 'చెట్టూ చెట్టూ, ఆడుకుందామా?' అని అడిగింది. 'ఇప్పుడు పగటి సమయం. ఈ ఎండలో నేను నా ఆకుల సాయంతో ఆహారాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఆడటం కుదరదు' అంది చెట్టు.
కాకిని పలకరించింది హేమ. 'కాకీ కాకీ, మనం ఆడుకుందామా?' అని అడిగింది. 'పగటి సమయంలో నేను ఆహారం వెతుక్కోవటానికి వెళ్లాలి. నా పిల్లలకు ఆహారం తీసుకురావాలి ఇప్పుడు ఆడటం కుదరదు' అంది కాకి.
గబగబా నడుచుకుంటూ వెళ్తున్న చీమను ఆపింది హేమ. 'చీమా చీమా, మనం ఆడుకుందామా?' అంది. 'అమ్మో నాకు పనుంది. ఆ చెట్టు అవతల ఉన్న బియ్యపు గింజల గుట్ట నుండి బియ్యాన్ని నా ఇంటికి చేరవేయాలి. ఇప్పుడు ఆడటం కుదరదు' అని వెళ్లిపోయింది చీమ.
వెనుక ఇంటి మామ్మ దగ్గరకు వెళ్లింది హేమ. 'మామ్మా, నేనొచ్చాను. మనం ఆడుకుందామా?' అని అడిగింది. 'ఇప్పుడు నేను పింఛను తెచ్చుకోవటానికి వెళ్లాలి. సాయంత్రం ఆడుకుందాం' అంది మామ్మ.
పక్కింటి పిన్ని ఇంటికి వెళ్లింది హేమ. 'పిన్నీ, ఆడుకుందామా?' అని అడిగింది. 'అమ్మో, నాకు పనుంది. బట్టలు ఉతకాలి, అన్నం వండాలి. ఇప్పుడు కుదరదు' అంది పిన్ని.
మళ్లీ ఇంటి వెనుక పెరట్లోకి వెళ్లింది హేమ. చెట్టు కింద కూర్చుంది. చెట్టుపైన పళ్ల కోసం అటూ ఇటూ తిరుగుతున్న ఉడుత హేమని చూసింది.
'అందరూ తమతమ పనులు చేసుకుంటున్నారు - ఒక్క నువ్వు తప్ప. అవునా?' హేమను అడిగింది ఉడుత.
'అవును...' అంది హేమ బాధగా.
హేమను చూసి జాలి పడింది ఉడుత. హేమతో చాలా సేపు ఆడింది. హేమకు ఎంతో సంతోషం కలిగింది.
'నా పని మానుకుని నీతో ఎందుకు ఆడానో తెలుసా? నీ విచారం పోగొట్టటానికి. పని చేసుకునేటప్పుడు పని చేసుకోవాలి. ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి. నీ వయసు పిల్లలకు పని అంటే చదువే. కాబట్టి నువ్వు పగలంతా బడికి వెళ్లి, చదువుకో. సాయంత్రం పూట చక్కగా ఆడుకోవచ్చు' అంది ఉడుత.
ఉడుత సలహా హేమకు నచ్చింది. అప్పటి నుండి ఏదోఒక వంకతో బడి ఎగ్గొట్టి, ఆడుకోవటం పూర్తిగా మానేసింది హేమ. ఖాళీ సమయంలో మాత్రమే ఆడుకుంటోంది.
- కళ్లేపల్లి తిరుమలరావు
్ఱతీబఎaశ్రీaతీaశీసaశ్రీశ్రీవజూaశ్రీశ్రీఱఏస్త్రఎaఱశ్రీ.షశీఎ