మదనపల్లె అర్బన్ : న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్మికులు మదనపల్లె డిఎల్‌పిఒ కార్యాలయం ముందు చేస్తున్న చేస్తున్న నివధిక దీక్ష గురువారం ఉద్రిక్తంగా మారింది. గురువారం మదనపల్లెకు వచ్చిన ఎంపీ మిథున్‌రెడ్డికి కార్మికులు తమ సమస్యలను విన్నవించేందుకు ప్రయత్నించగా ఆయన పట్టించుకోకుండా దీంతో ఆగ్రహించిన కార్మికులు ఎంపీ కాన్వరును అడ్డుకుని తిరుపతి రోడ్డుపై బైఠాయించారు. గంట పాటు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రజాప్రతినిధులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. అక్కడే ఉన్న రెండో పట్టణ సిఐ మురళీ కృష్ణ తన సిబ్బందితో కలిసి కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కార్మికులు ససేమిరా అనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి దాడి చేశారు. ఆందోళన కారులను జీపులోకి ఎక్కించి అరెస్టు చేశారు. మహిళలు అని కూడా చూడకుండా వాహనాల్లో ఎక్కించారు. ఆందోళన కారులను రెండో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో సిపిఎం జిల్లా కారయదర్శి శ్రీనివాసులు, పంచాయతీ కార్మిక సంఘం నాయకులు నాగరాజు, శంకర ఉన్నారు.
సమస్యలు పరిష్కరించాలని కోరితే అరెస్టు చేస్తారా?
ఈ సందర్భంగా పంచాయతీ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రామయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటు సభ్యులు మిధున్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషాలకు ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలు, కార్మికుల సమస్యలు పట్టడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న పంచాయతీ కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కొనలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జిఒలను అమలు చేయాలని కోరడమే అన్యాయం అన్నట్లుగా ప్రభుత్వ పెద్దలు వ్యవహారించడం సరైంది కాదన్నారు. కార్మికులకు ఇఎస్‌ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, వేతనాలు బ్యాంకు ద్వారా ఇవ్వాలని కోరితే, కేసులు పెడతారా అని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు అందినకాడికి దండుకోవడం కోసమే వేతనాలు బ్యాంకులో ఇవ్వడం లేదని విమర్శించారు. హైకోర్టు తీర్పు అమలు చేయాలని, కనీస వేతనం రూ. 21 వేలు ఇవ్వాలని, మరణించిన కార్మికులకు మట్టి ఖర్చులు రూ.25 వేలు ఇవ్వాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే సమస్యలు పరిష్కరించాలని అక్రమ అరెస్టులు చేసి భయపెట్టాలి అనుకోవడం అవివేకం అన్నారు. పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్క రించాలని లేనిపక్షంలో ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చ రించారు. సిఐటియు నాయకులు సురేంద్ర, రఘునాథ్, పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు గోపాల్, ఇమ్రాన్, నాగరాజు, ప్రమీల, శ్యామల పాల్గొన్నారు.
నాయకుల అరెస్ట్ అప్రజాస్వామికం
రాయచోటి టౌన్ : పెండింగ్ వేతనాలు అడిగితే పోలీసులు నాయకులను, కార్మికులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని సిఐటియు జిల్లా ఉఫాధ్యక్షుడు ఎ.వి. రమణ, జిల్లా కార్యదర్శి డి. భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. గురువారం స్థానిక సిఐటియు కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మదనపల్లి రూరల్ పరిధిలోని గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యల పట్ల మూడు రోజులుగా ముందస్తు నోటీసు ఇచ్చి శాంతియుతంగా నిరసన చేస్తున్నారని చెప్పారు. గురువారం ఎంపీ మిథున్‌రెడ్డికి వినతి పత్రం ఇవ్వడానిక వెళ్తే కార్మికులను , సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పి .శ్రీనివాసులు అత్యుత్సాహంతో పోలీసులు అరెస్టు చేయడం దారుణమని వాపో యారు. అరెస్టయిన వారిని విడుదల చేయకపోతే శుక్రవారం పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు యస్ .ఫయాజ్ నాయకులు విజయమ్మ పాల్గొన్నారు.










