ఢిల్లీ పోలీసుల పక్షపాత ధోరణి
విచక్షణా రహితంగా అరెస్టులు
జహంగీర్‌పురి ఘర్షణలపై వామపక్షాల నిజ నిర్ధారణ బృందం నిర్ధారణ
న్యూఢిల్లీ : ఢిల్లీలోని జహంగీర్‌పురి సి బ్లాక్‌లోని మతోన్మాద ఘర్షణలు చెలరేగిన ప్రాంతాల్లో ఆదివారం వామపక్షాలకు చెందిన నిజ నిర్ధారణ బృందం పర్యటించింది. సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్), ఫార్వర్డ్ బ్లాక్‌లకు చెందిన నేతలు, ఇరు కమ్యూనిటీలకు చెందిన బాధితులను, అక్కడి ప్రజలను కలుసుకుని వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 50కుటుంబాల వారితో ప్రతినిధుల బృందం మాట్లాడింది. అనంతరం ఆ ఏరియా అదనపు డిసిపి కిషన్ కుమార్‌ను, ఇతర పోలీసు సిబ్బందిని కూడా కలుసుకుని మాట్లాడారు.
16వ తేదీన ఏం జరిగింది?
వాస్తవాలేమిటో తెలుసుకునేందుకు వెళ్ళిన బృంద సభ్యులకు అక్కడి వారి చెప్పినదేమంటే - హనుమాన్ జయంతి రోజున 150నుండి 200మంది వరకు వున్న బృందం ఆయుధాలు చేబూని పెద్దగా డిజె మ్యూజిక్‌తో, నినాదాలు చేసుకుంటూ వీధుల్లో తిరుగుతూ ఉన్నారు. వారి చేతుల్లో పిస్టల్లు, కత్తులు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ విషయం వివిధ టివి చానెళ్లలో చూపించిన వీడియోల ద్వారా కూడా నిర్ధారణ అయింది. పెద్ద పెద్దగా, చాలా దూకుడుగా నినాదాలు చేస్తూ ఉన్నారు. స్థానికులు నిర్వహించిన ప్రదర్శన కాదని, బజరంగ్ దళ్ యువజన విభాగం నిర్వహించిన ప్రదర్శన అని అక్కడి వారు చెప్పారు. వారిలో చాలామంది బయటివారే. ఆ ప్రదర్శనతో పాటు రెండు పోలీసు జీపులు కూడా ఉన్నాయి. ఒకటి ముందు భాగాన వుండగా, రెండోది చివర భాగాన కొనసాగింది. ఆ జీపుల్లో ఇద్దరేసి మాత్రమే ఉన్నారు.
ఇక్కడ తలెత్తే మొదటి ప్రశ్న ఏమిటంటే - పోలీసులు తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదు ? ఆ ప్రదర్శనలో ఇలా బహిరంగంగా ఆయుధాలు చేబూనడానికి పోలీసులు ఎందుకు అనుమతినిచ్చారు. ?
జహంగీర్‌పుర్ సి బ్లాక్ ఏరియాలో అప్పటికే ఆ ప్రదర్శన రెండుసార్లు తిరిగింది. ఈ ఏరియాలో బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఎక్కువగా వుంటారు. మూడో రౌండ్ జరుగుతున్నపుడు ఈ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. బిజెపి నేతలు చెబుతున్నట్లుగా ప్రదర్శనపై దాడి చేయాలని స్థానిక ముస్లిమ్‌లు కుట్ర పన్నినట్లైతే మొదటి రెండురౌండ్లు సమయంలోనే దాడులు జరిగి వుండేవి కదా! అలాకాకుండా, రోజాను దృష్టిలో వుంచుకుని మసీదు వద్దకు ప్రార్థనల కోసం ముస్లిమ్‌లు వచ్చినపుడే సరిగ్గా మసీదు వెలుపల ప్రదర్శనను నిలుపుచేయడంతో ఈ సంఘటనలు జరిగాయన్నది వాస్తవం.
ఇక రెండో ప్రశ్న - మసీదు దగ్గరే ప్రదర్శనను నిలుపు చేయడానికి ఎందుకు అనుమతించారు? మసీదు వెలుపల నినాదాలు చేయడానికి ఎలా అనుమతించారు.?
రోజా ముగిసే మయంలో, ముస్లింలందరూ అక్కడకు చేరే వేళ సరిగ్గా మసీదుకు బయట ప్రదర్శన నిలుపుచేసేందుకు సాయుధ ప్రదర్శకులను అనుమతించారు. ఈ సంఘటనలను కుట్రగా అభివర్ణించినట్లైతే - ఇక్కడ కుట్రకు పోలీసులదే బాధ్యత.
రెండు పక్షాల నుంచి రాళ్లు విసురుకోవడం జరిగిందని నిజ నిర్ధారణ బృందానికి చెప్పారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన పోలీసులు ఇరుక్కుపోయారని, కొంతమంది గాయపడ్డారని తెలిపారు.
ఆ తర్వాత రాత్రిపూట పోలీసులు ఆ ప్రాంతంలో దాడులు చేస్తూ విచక్షణా రహితంగా అరెస్టులు చేశారు. తమ ఇళ్లపై ఎందుకు దాడి చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించిన మహిళలపై దాడులు చేశారు. వారి కడుపులో గుద్దుతూ, చావబాదారు. పోలీసు స్టేషన్‌కు వెళ్ళిన నిజ నిర్ధారణ బృందానికి అక్కడ విస్తుపోయే దృశ్యాలు కనిపించాయి. బిజెపి అధ్యక్షుడు అదేష్ గుప్తా, ఎంపి హంసరాజ్ హన్స్ పోలీసు స్టేషన్ ఆవరణలో పోలీసు అధికారుల సమక్షంలో పత్రికా సమావేశం నిర్వహించారు. వారిచుట్టూ వున్న వారు 'జై శ్రీరామ్' అని నినాదాలు చేస్తున్నారు.
ఇక మూడో ప్రశ్న - ఇది పోలీసుల పక్షపాతంగా స్పష్టంగా కనిపించడం లేదా ?
ఆ మొత్తం ప్రాంతంలో పోలీసుల విచారణ అంతా బిజెపి నేతల ప్రభావంతో ఏకపక్షంగా సాగుతోందని బృందానికి అర్ధమైంది. అదనపు డిసిపితో బృందం మాట్లాడింది. ఊరేగింపుదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం ముస్లిం కమ్యూనిటీకి చెందిన యువతనే విచక్షణారహితంగా అరెస్టులు చేస్తూ పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరించడాన్ని, దానిపై అక్కడి ప్రజల భయాందోళనలను ఆయనకు తెలియచేసింది. పురుష పోలీసులు ఆడవారిపై చేయి చేసుకోవడానికి సంబంధించి మహిళల ఫిర్యాదులను కూడా బృందం పోలీసులకు తెలియజేసింది. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల్లో ఇప్పటివరకు ఎన్నడూ ఒక్క మత ఘర్షణ కూడా చోటు చేసుకోలేదని బృందం కనుగొంది. దశాబ్దాల తరబడి హిందువులు, ముస్లిములు సహ జీవనం సాగిస్తున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం ఈ రీ సెటిల్‌మెంట్ కాలనీని ఏర్పాటు చేసినప్పటి నుండి జహంగీర్‌పురిలో బెంగాలీ ముస్లిములు నివసిస్తున్నారు. ప్రధానంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, చేపలు అమ్ముకునేవారు, చెత్త ఏరుకునేవారి కుటుంబాలే ఉన్నాయి. వారిని చట్ట వ్యతి రేకులుగా, రోహింగ్యా శరణార్థులుగా బిజెపి పేర్కొనడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. వారందరూ ఢిల్లీ పౌరులు.
నిర్ధారణ : మతోన్మాద ఘర్షణలను సృష్టించడానికి మతపరమైన సందర్భాలను, పండుగలను ఉపయోగించుకునేందుకు సంఘ పరివార్ అనుబంధ శక్తులు అమలు చేస్తున్న ఎజెండాలో భాగంగానే జహంగీర్‌పురి సంఘటనలు జరిగాయని నిజ నిర్ధారణ బృందం భావించింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.
తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకుని ఢిల్లీ పోలీసుల పక్షపాతాన్ని ఎండగట్టేలా చర్యలు తీసుకోవాలని వామపక్షాలు హోం శాఖకు, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాయి. ఈ విచ్ఛిన్నకర శక్తులపై తక్షణమే చర్య తీసుకోవాలని పోలీసులను కోరాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వెంటనే ఇందులో జోక్యం చేసుకోవాలని కోరాయి ఈ ప్రతినిధి బృందంలో సిపిఎం నేత రాజీవ్ కుమార్, సిపిఐ నేతలు వివేక్ శ్రీవాస్తవ, సంజీవ్‌రాణా, సిపిఎం(ఎంఎల్) కార్యదర్శి రవి రాయ్, ఫార్వర్డ్ బ్లాక్ నేత అమిత్ సహా జెఎంఎస్, డివైఎఫ్‌ఐ, ఎఐసిసిటియు, ఎఐఎస్‌ఎ నేతలు ఉన్నారు.










