రాజంపేట అర్బన్ : ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక జూనియర్ కలాశాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించలేమంటూ, విద్యార్థులే పాఠ్యపుస్తకాలు కొనుక్కోవాలంటూ ఇంటర్ విద్యా శాఖ ఆదేశించడాని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మూడు సంవత్సరాల నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించడం లేదని తెలిపారు. పాఠ్య పుస్తకాలు అందించకపోతే విద్యార్థులు ఏ రకంగా చదువుకుంటారని ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో విద్యకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నామంటూ గొప్పగా చెప్పుకోవడమే తప్ప ఆచరణలో అది కనబడటం లేదని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్మీడియట్ విద్యకు ప్రత్యేక నిధులు కేటాయించకపోగా విద్యార్థులు ఫీజులు ద్వారా చెల్లించిన ఇంటర్ విద్యామండలి నిధులు మొత్తం నాడు-నేడు పథకానికి దారి మళ్లించడం సిగ్గుచేటన్నారు. వెంటనే ఇంటర్మీడియట్ విద్యకు ప్రత్యేక నిధులు కేటాయించి, విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యచరణతో ఆందోళనలకు పూనుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వంశీ, భాష, నరసింహ, వెంకటేష్ పాల్గొన్నారు.










