Sep 24,2023 19:39

వైద్యసేవలు అందిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-నెల్లూరు : స్థానిక డైకస్‌ రోడ్డు సెంటర్‌ వద్దనున్న వియానీ హౌమ్‌లో శ్రీవత్స చెస్ట్‌ అండ్‌ చిల్డ్రన్స్‌ క్లినిక్‌, కమ్యూనిటీ పారామెడిక్స్‌ అండ్‌ ప్రైమరీ హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్యంశిబిరం నిర్వహించారు. ఆదివారం ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ కె.చిరంజీవి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రధమ చికిత్సలు అందిస్తున్న పిహెచ్‌సిల పిలుపుమేరకు వియానీ హౌమ్‌ లోని పిల్లలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి, అన్ని రకాల పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఊపిరితిత్తుల వైద్య నిపుణురాలు డాక్టర్‌ కె.కళ్యాణి మాట్లాడుతూ జీవన విధానంలో ఆహారపు అలవాట్లు మారడం వల్ల రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయని, ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. విశ్రాంత ఏఎస్‌ఐ షేక్‌ మహబూబ్‌ బాషా, పిఎంపి గౌరవాధ్యక్షులు అనుముల జయప్రకాష్‌, పి.హెచ్‌.పి రాష్ట్ర కోశాధికారి శాఖవరపు వేణుగోపాల్‌, రూడ్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ షేక్‌ రసూల్‌, వియాని హౌమ్‌ నిర్వాహకురాలు రమా సిస్టర్‌, పి.హెచ్‌.పి నెల్లూరు డివిజన్‌ అధ్యక్ష కార్యదర్శులు గోరంట్ల శేషయ్య, దేవరకొండ శ్రీనివాసులు పాల్గొన్నారు.