ప్రజాశక్తి-హిందూపురం న్యాయస్థానాల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఉచిత న్యాయ సహాయంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లాన్యాయ సేవా అధికారి సంస్థ కార్యదర్శి జి.దీనబాబు సూచించారు. సోమవారం స్థానిక సబ్‌జైలను దీనబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్‌జైల్లో ఉంటున్న ఖైదీలు, వారి వివరాలను జైలర్ చంద్రశేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖైదీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా వార్షికాదాయం రూ.3లక్షలలోపు ఉన్న బిసి, ఒసి వర్గాలకు కూడా ఉచిత న్యాయ సహకారం అందిస్తామన్నారు. అనంతరం ఏ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.. ఎప్పటి నుంచి జైలులో ఉంటున్నారు... న్యాయవాదులు ఉన్నారా.. లేదా.. అన్న విషయాలను ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్య సదుపాయం, ఆహార నాణ్యత, మంచినీరు, పరిశుభ్రత అంశాలను నేరుగా ఖైదీలతోనే అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పార్వతి, నవేరా, లోక్‌అదాలత్ శారద, హేమావతి తదితరులు పాల్గొన్నారు.
ఖైదీలతో మాట్లాడుతున్న జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ కార్యదర్శి జి. దీనబాబు










