- రూ.1.36 కోట్లతో త్వరలో పనులు ప్రారంభం
ప్రజాశక్తి-తిరుమల : తిరుమల నడక మార్గంలో అలిపిరి పాదాల మండపం వద్ద భక్తులు విశ్రాంతి తీసుకునే పురాతన రాతి మండపం శిధిలావస్థకు చేరుకున్నదని, దీనిని త్వరలో పునర్నిర్మించనున్నట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి చెప్పారు. బుధవారం ఉదయం అలిపిరి పాదాల మండపం వద్ద ఈవో, జేఈవో శ్రీ వీరబ్రహ్మంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, 16వ శతాబ్దంలో అప్పటి రాజులు శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు నడక మార్గానికి ఇరువైపులా రెండు రాతి మండపాలు నిర్మించినట్లు తెలిపారు. ఈ మండపాలలో ఒకటి శిధిలావస్థకు చేరుకున్నదని, ఈ మండపాన్ని గతంలో ఇదివరకే ఒకసారి మరమ్మతులు చేశారని తెలిపారు. ప్రస్తుతం ఈ మండపానికి మరమ్మతులు చేసేందుకు కూడా వీలుకాదని టీటీడీ ఇంజనీరింగ్ విభాగం వారు ఇచ్చిన నివేదిక అనుసరించి దీనిని పునర్నిర్మించాలని టీటీడీ నిర్ణయించిందన్నారు. ఇందులోని రాతి స్తంభాలు, పై కప్పును పునర్నిర్మాణంలో వినియోగిస్తామన్నారు. ఈ మండపం వెనుక వైపున గోడ పూర్తిగా కూలిపోయిందని మండపంలోనికి భక్తులు వెళ్లకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. రూ.1.36 కోట్లతో త్వరలో ఈ రాతి మండపం పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. గతంలో తిరుమలలోని పార్వేటి మండపం శిధిలావస్థకు చేరుకున్నందున పునర్నిర్మించినప్పుడు కూడా కొన్ని సామాజిక మధ్యమాలలో, కొందరు వ్యక్తులు టీటీడీ పై దుష్ప్రచారం చేశారన్నారు. దీనివలన భక్తుల మనోభావాలు దెబ్బతింటుందని ఇకపై ఇలాంటి దుష్ప్రచారం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు ఈవో మండపము వెనుకవైపు దెబ్బతిన్న గోడను, మండపంలోని రాత్రి స్తంభాల గురించి మీడియాకు వివరించారు.










