Oct 07,2023 07:44
  • ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ ధర్నాలో లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతోనే రవాణా రంగం సంక్షోభంలోకి కూరుకుపోయిందని ఆంధ్రప్రదేశ్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై ఈశ్వరరావు విమర్శించారు. ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ పిలుపు మేరకు శుక్రవారం విజయవాడలోని ధర్నా చౌక్‌లో రవాణా రంగ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వై ఈశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలో రవాణా ఖర్చును 16 శాతం నుంచి తొమ్మిది శాతానికి తగ్గిస్తామని జాతీయ రవాణా విధానాన్ని ప్రకటించిన కేంద్రం ఎలా తగ్గిస్తుందో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రతియేటా టోల్‌ ఛార్జీలను, డీజిల్‌ రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచితే రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు, గ్రీన్‌ ట్యాక్సులను పెంచుతున్నాయని విమర్శించారు. రవాణా రంగ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో రవాణా రంగం కీలకమైందన్నారు. 85 శాతం మంది ప్రయాణికులు, 60 శాతం సరుకులు రోడ్డు రవాణాతోనే జరుగుతోందన్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి రవాణా రంగంలోనే వుందని అన్నారు. రవాణా రంగంలోని అసంఘటిత రంగ కార్మికుల పిఎఫ్‌, ఇఎస్‌ఐ, గ్రాట్యూటీ, ఎనిమిది గంటల పని విధానం, వారాంతపు సెలవులతో సామాజిక భధ్రత చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అయ్యపురెడ్డి మాట్లాడుతూ.. రవాణా రంగాన్ని మొత్తం కార్పొరేట్‌ శక్తులకు అప్పజెప్పేందుకే కేంద్ర ప్రభుత్వం మోటార్‌ వెహికల్‌ సవరణ చట్టం 2019ను తెచ్చిందని విమర్శించారు. ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. రవాణా రంగ కార్మికులకు సామాజిక సంక్షేమ చట్టం, 2019 ఎంవి యాక్ట్‌ సవరణను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ శివాజి, ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్‌కె జిలాని బాషా, అధ్యక్షులు సిహెచ్‌ సుందరయ్య, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు ఎన్‌ రాజా, పి అప్పలరాజు, సిఐటియు నాయకులు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.