- రైతు సంఘాల సమన్వయ సమితి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విద్యుత్ సవరణ బిల్లు 2020 ఉపసంహరించాలని, కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని కోరుతూ ఈ నెల 26న అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ప్రకటించింది. బుధవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు, నాయకులు వై కేశవరావు, కె ప్రభాకరరెడ్డి, రావుల వెంకయ్య, కెవివి ప్రసాద్, ఆళ్ల వెంకట గోపాలకృష్ణ, రాజమోహన్, సింహాద్రి ఝాన్సీ, హరినాథ్ తదతరులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2014 నుండి ఇప్పటి వరకూ కార్పొరేట్ సంస్థలకు రూ.10 లక్షల కోట్లు రుణమాఫీ చేసిందని, స్వామినాథ్‌న్ కమిటీ సిఫార్సులు అనుగుణంగా సి2ప్లస్50 శాతం ఫార్ములా ప్రకారం కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం తెస్తామని హామీనిచ్చిందని, ఇంతవరకు అమలు చేయలేదని వివరించారు. ఢిల్లీ రైతుల ఉద్యమంలో అమరులైన 750 మంది రైతుల కుటుంబాలన్నిటికీ పరిహారం ఇవ్వాలని, రైతులపై పెట్టిన 80 వేల కేసులు ఉపసంహరించుకోవాలని కోరారు. సింఘా బోర్డర్లో రైతు ఉద్యమానికి గుర్తుగా చిహ్నం ఏర్పాటు చేయాలని కోరారు. కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగా రైతులకు సంపూర్ణ రుణవిముక్తి కల్పించాలని కోరారు. సమగ్ర భూ సర్వేలో పెద్దఎత్తున జరిగని తప్పులను సరిచేసిన తర్వాతే రైతులకు పాసు పుస్తకాలు ఇవ్వాలని, రైతులకు కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ద్రోహం చేసిన వైనంపైన ఈ నెల 26న విజయవాడతోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే ట్రాక్టర్ల ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమవేశంలో నాయకులు రంగారావు, జమలయ్య, మరీదు ప్రసాదుబాబు, వెంకటరెడ్డి, ప్రసాదు, పివి ఆంజనేయులు, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.










