హైదరాబాద్ : తెలంగాణలో ఆదివారం నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎగ్జిబిటర్ల అసోసియేషన్ నిర్ణయించింది. ఇటీవల లాక్‌డౌన్ కారణంగా థియేటర్ల యజమానులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ఎగ్జిబిటర్లు పలుమార్లు తమ బాధలను ప్రభుత్వానికి విన్నవించిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి థియేటర్లను ఆదుకునేందుకు స్పష్టమైన హామీ రావడంతో ఆదివారం నుంచి సినిమా థియేటర్లు తెరవాలని తెలంగాణ ఫిల్మ్ చాంబర్, థియేటర్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సంయుక్తంగా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న దృష్ట్యా ఎగ్జిబిటర్లు ఎవరైనా థియేటర్లు తెరుచుకోవచ్చని సూచించింది. ప్రభుత్వం ఇప్పటికే 100 శాతం సీట్ల సామర్థ్యంతో అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రేపటి నుంచి పూర్తి స్థాయిలో అన్ని మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు కొనసాగించాలని తీర్మానించినట్లు ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కార్యదర్శి విజయేందర్ రెడ్డి తెలిపారు.










