Jan 13,2023 21:57

తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న సిఐటియు నాయకులు

         ప్రజాశక్తి-హిందూపురం  పట్టణంలో ప్రేక్షలకు కనీస సౌకర్యాలు కల్పించని సినిమా థియేటర్లపై దాడులు నిర్వహించి చర్యలు తీసుకోవాలని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప డిమాండ్‌ చేశారు. సౌకర్యాలు కల్పించని సినిమా థియేటర్లలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తు సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ముందు శుక్రవారం ఆందోళన చేసి తహశీల్దార్‌ ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా నరసింహప్ప మాట్లాడుతు వాహనాలకు పార్కింగ్‌ ఫీజు వసూలు చేయరాదని నిబందనలు ఉన్నప్పటికి పట్టణంలోని లక్ష్మీ థియేటర్‌ నిర్వహకులు పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నారన్నారు. అయితే పార్కింగ్‌ ఫీజు వసూలు చేచడం తప్ప వాహనాలకు, వాహనంలో ఉన్నా వస్తువులకు ఎలాంటి బాధ్యత తీసుకోవడం లేదన్నారు. ఇక్కడ సిసి కెమెరాలు సైతం పని చేయడం లేదన్నారు. రూ.50 టికెట్‌ను రూ.200లకు విక్రయిస్తు ప్రేక్షకులను అడ్డంగా దోచుకుంటు సోమ్ము చేసుకుంటున్నారన్నారు. థియేటర్లలో ప్రేక్షకులకు కనీసం తాగాడానికి నీరు సైతం ఏర్పాటు చేయడం లేదన్నారు. ఇదే విధంగానే అన్ని థియేటర్లలలో ఉందన్నారు. రెవిన్యూ అధికారులు పరిశీలన చేసి ఇలాంటి థియేటర్లపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రామకృష్ణ, అత్తర్‌ బాబా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి, కల్లూరు ఆటో స్టాండ్‌ యూనియన్‌ నాయకులు నరేష్‌, రఫీక్‌, నగేష్‌, లక్ష్మీపతి, ఎన్‌ రమేష్‌, నవీన్‌, కే బాబు, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.