Jul 13,2023 05:59

రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఉపాధ్యాయుల మీద ఒత్తిడి పెరుగుతోంది. డబుల్‌ టీచర్‌ స్కూళ్లు కూడా ఉన్నాయి. వీటిలో కేవలం ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉంటున్నారు. సింగిల్‌ టీచర్‌ స్కూళ్లలో ఆ టీచర్‌, డబుల్‌ టీచర్‌ స్కూళ్లలో ఇద్దరు టీచర్లలో ఒకరు లేదా ఇద్దరు సెలవు పెడితే ఆ ప్రభావం విద్యార్ధుల చదువుపై తీవ్రంగా పడుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు విద్యాసంస్కరణలకు తోడు మధ్యాహ్న భోజనం, ఇతర కార్యక్రమాల కారణంగా టీచర్లు ఒత్తిడికి గురవుతున్నారు. మామూలు స్కూళ్లలో అయితే ఓ టీచర్‌ సెలవు పెట్టినా మరో టీచర్‌తో నడిపించే పరిస్థితి ఉంటోంది. కానీ సింగిల్‌, డబుల్‌ టీచర్‌ స్కూళ్లలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఉన్నతాధికారులు ఆ యా టీచర్లకు సెలవులు నిరాకరిస్తున్నారు. దీంతో వారు చెప్పకుండానే మానేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్స్‌ అనే వ్యవస్ధను గతంలో తీసుకొచ్చారు. ఇది కూడా పూర్తిస్ధాయిలో అమలు కావడం లేదు. దీంతో ఇప్పటికే ఉన్న క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్స్‌ను క్లస్టర్‌ రిజర్వ్‌ మొబైల్‌ టీచర్లుగా మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి తమ పరిధిలో ఉన్న కనీసం మూడు నుంచి నాలుగు స్కూళ్లను అప్పగించాలని నిర్ణయించారు. ఈ పరిధిలో ఎక్కడ టీచర్‌ సెలవు పెట్టినా వీరు ఆ యా స్కూళ్లకు వెళ్లి బోధన కొనసాగించాల్సి ఉంటుంది. త్వరలో ప్రభుత్వం వీరి కోసం ఓ మొబైల్‌ యాప్‌ తెస్తోంది. అందులో ఎక్కడ టీచర్‌ లేకపోతే అక్కడ వీరిని కేటాయిస్తారు. గతంలో కూడా సింగిల్‌ టీచర్‌ స్కూళ్ళలో ఉపాధ్యాయులు సెలవులు పెట్టినపుడు సిఆర్పీలను స్కూళ్లకు విధులు కేటాయించినపుడు కేవలం విద్యార్ధులకు హాజరు వేసి, మధ్యాహ్న భోజనం నిర్వహించి వెళ్లిపోయిన సందర్భాలు ఎన్నో చూశాం. ఈ నేపథ్యంలో సిఆర్పీలను క్లస్టర్‌ రిజర్వ్‌ మొబైల్‌ టీచర్స్‌గా పేరు మార్చి బోధన విధులు కేటాయించడం వల్ల విద్యార్ధులకు జరిగే మేలు పెద్దగా ఉండకపోవచ్చు. కావున పూర్తిగా రెగ్యులర్‌ టీచర్లను నియమించాలి. అప్పుడు మాత్రమే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది.


- వాసిలి సురేష్‌,
సెల్‌ : 9494615360