పీలేరు : త్యాగానికి నిలువెత్తు రూపం రమాబాయి అంబేద్కర్ అని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. మంగళవారం పీలేరులోని మాల మహానాడు కార్యాలయంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ 125వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మాలమహనాడు జిల్లా ఉపాధ్యక్షులు జెట్టి మల్లికార్జున, భారతీయ అంబేద్కర్ సేన జిల్లా కార్యవర్గ సభ్యులు ముల్లంగి కృష్ణయ్య రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాలమహనాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్ కుమార్ మాట్లాడుతూ తన బిడ్డల ప్రాణాలను మాకోసం ధారపోసిన ప్రపంచ మేధావి, బహుజనుల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను మాకు అందించి, మమ్మల్ని ఆత్మగౌరవంతో జీవించేలా చేసిన మాత రమాబాయి త్యాగం వెలకట్టలేనిదని అంబేద్కర్ విజయాల వెనుక రమాబాయి కృషి మరువలేనిదని చెప్పారు. ఆకాశమంత మీ త్యాగం మహిళలకు స్పూర్తి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాలమహనాడు రాయలసీమ జిల్లాల కార్యదర్శి నగరిమడుగు సుబాష్, భారతీయ అంబేద్కర్ సేన పీలేరు నియోజకవర్గ అధ్యక్షులు ఎర్రబల్లి మల్లికార్జున, మాలమహనాడు మండల కోశాధికారి మద్దెల బాలగంగాధర్, మండల కార్యవర్గ సభ్యులు జి.రాజేంద్రబాబు, మద్దెల జనార్దన్, అరిపెంట ఆనంద్, జి.విజరు కుమార్, పాల్గొన్నారు.










