May 12,2023 20:57

- మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ

-పీలేరు: జిల్లాలోని అన్ని మండలాల్లోనూ త్వరలో రైతులకు అందుబాటులో వేరుశనగ విత్తనాలు రానున్నాయని జిల్లా వ్యవసాయ అధికారి యు.ఉమామహేశ్వరమ్మ తెలిపారు. శుక్రవారం ఆమె పీలేరు మండల వ్యవసాయ కార్యాలయంలో మండల వ్యవసాయ సలహా మండలితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేరుశనగ కాయల విత్తనాలను వీలైనంత త్వరగా మండలాలకు తెప్పిస్తామని పేర్కొన్నారు. ఖరీఫ్‌ సాగుకు ఎలాంటి వేరుశనగ కొరత రాకుండా, లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్లస్టర్‌ యంత్రసేవా పథకంలో వరికోత యంత్రం, కిసాన్‌ డ్రోన్లు సబ్సిడీకి అందుబాటులో ఉన్నాయని, వీటి కొనుగోలుకు రైతులు ముందుకు రావాలని కోరారు. పీలేరు డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు వైవి రమణ రావు మాట్లాడుతూ చిరుధాన్యాలను కూడా సబ్సిడీకి తెప్పిస్తామని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలియచేశారు. పశు సంవర్థకశాఖ అధికారి కె. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అనిమల్‌ అంబులెన్స్‌, టోల్‌ఫ్రీ1962 సేవలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం, కెవి పల్లి మండల వ్యవసాయ అధికారులు షణ్ముగం, శ్రావణి, పీలేరు మండల వ్యవసాయ అధికారిణి రమాదేవి, టిఎ కరుణాకర్‌ రెడ్డి, ఉద్యానవన అధికారి సుకుమార్‌ రెడ్డి, డిఆర్‌డిఎ ఎపిఎం లక్ష్మణ రెడ్డి, రైతు భరోసా కేంద్ర సిబ్బంది, ఎఇఒలు పాల్గొన్నారు.