Jul 11,2021 13:22

హైదరాబాద్‌ : అత్యధిక చిత్రాల దర్శక దిగ్గజంగా గిన్నిస్‌బుక్‌లోకెక్కిన దాసరి నారాయణరావు బయోపిక్‌ 'దర్శక రత్న' గా త్వరలో వెండితెరపై కనులవిందు చేయనుంది. తాడివాక రమేష్‌ నాయుడు నిర్మాతగా ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో ''దాసరి బయోపిక్‌'' మూవీని నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. 'దర్శకరత్న' పేరుతో ఈ బయోపిక్‌ రూపొందనుంది. ఇమేజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై తెరకెక్కబోయే ఈ మూవీ అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుండగా, ఇందులో ఓ ప్రముఖ హీరో దాసరి పాత్రను పోషించనున్నారు.

దాసరి స్మారకార్ధం.. జీవన సాఫల్య పురస్కారాలకు సన్నాహం..
దాసరి స్మారకార్ధం 'దాసరి నారాయణరావు నేషనల్‌ ఫిల్మ్‌ అండ్‌ టివి నేషనల్‌ అవార్డ్స్‌' ను ప్రదానం చేసేందుకు ప్రముఖ నిర్మాత తాడివాక రమేష్‌ నాయుడు సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం ఆయన ఇప్పటికే 'దాసరి నారాయణరావు మెమోరియర్‌ కల్చరల్‌ ట్రస్ట్‌' ను ఏర్పాటు చేశారు. వివిధ భాషలకు చెందిన కళాకారులు-సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు (లైఫ్‌ టైమ్‌ అచీవ్మెంట్‌ అవార్డ్స్‌) ను ఇచ్చి సత్కరించబోతున్నారు.

దాసరి పాత్రలో ప్రముఖ హీరో : తాటివాక రమేష్‌ నాయుడు
ఇమేజ్‌ ఫిల్మ్స్‌ అధినేత తాటివాక రమేష్‌ నాయుడు మాట్లాడుతూ.. ''నా గురువు, దైవం అయిన దాసరి పేరిట ప్రతి ఏటా ఫిల్మ్‌ అండ్‌ టివి నేషనల్‌ అవార్డ్స్‌ ఇవ్వాలని సంకల్పిస్తున్నాం. అలాగే దాసరికి అత్యంత సన్నిహితులు, ప్రముఖ దర్శకులు అయిన ధవళ సత్యం దర్శకత్వంలో 'దర్శకరత్న' పేరుతో దాసరి బయోపిక్‌ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ధవళ సత్యం గారు ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు పూర్తి చేశారు. స్క్రిప్ట్‌ అత్యద్భుతంగా వచ్చింది. ఓ ప్రముఖ హీరో దాసరి పాత్రలో నటించనున్నారు. పూర్తి వివరాలు అతి త్వరలో ప్రకటిస్తాం'' అని వివరించారు.