వివిధ సమస్యలపై స్పందన కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే అర్జీలకు త్వరితగతిని పరిష్కారం చూపాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ బసంత్‌కుమార్ సూచించారు. సోమవారం నాడు పుట్టపర్తి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్, పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖతో కలిసి స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల ప్రజలు 127 అర్జీలను అందించారు. అనంతరం కలెక్టర్ జిల్లాలోని అన్ని మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. స్పందన గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలన్నారు. రీ ఓపెన్ క్యాటగిరీలో మళ్లీ అర్జీలు పదేపదే రాకుండా నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణా పనులను అనుకున్న సమయంలోపు పూర్తి చేయాలన్నారు. నిర్మాణ పనుల్లో మడకశిర నియోజకవర్గం అగలి, అమరాపురం మండలాలలో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని సంబంధిత అధికారులు వీటిపై స్పందించి వేగం పెంచాలన్నారు. గోరంట్ల, హిందూపురం, నల్లమాడ, సోమందేపల్లి, తనకల్లు మండలాల్లోనూ పనులను వేగవంతం చేయాలన్నారు. జగన్న కాలనీల్లో గృహ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పందన తహశీల్దార్ గోపాలకష్ణుడు, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, డీఈవో మీనాక్షి, సిపిఒ విజరు కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










