- కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
- సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరిక
ప్రజాశక్తి - కలెక్టరేట్ (కష్ణా) : వాతావరణ శాఖ మరో తుపాను హెచ్చరికను జారీ చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రమైన గాలులకు చెట్లు కూలే అవకాశం ఉందని హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లొద్దని పేర్కొంది. ఈనేపథ్యంలో దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు తీరప్రాంత మండలాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల ఆదేశించారు. శుక్రవారం తీరప్రాంత మండలాల తహశీల్దార్లు, మత్స్య, వైద్య ఆరోగ్య, పోలీస్, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ శాఖల అధికారులతోపాటు ఆర్‌డిఒలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెం.08672 252572, మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నెం.9849903982 లలో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తీరప్రాంతాల్లో ఉన్న 45 మల్టీపర్పస్ సైక్లోన్ షెల్టర్లను పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వాటిని పరిశుభ్రంగా ఉంచి అన్ని గ్రామ సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటి పథకాలు పనిచేసేలా జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాకు ముందస్తు చర్యలు చేపట్టాలని, మంచినీటి ప్యాకెట్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. పారిశుధ్య చర్యలకు ఇఒఆర్‌లను అప్రమత్తం చేయాలన్నారు. చెట్లు కూలిపోతే రహదారులను క్లియర్ చేసేందుకు పవర్ రంపాలను సిద్ధం చేసుకోవాలన్నారు. చెరువు కట్టలు తెగే అవకాశం ఉండొచ్చని, ఇసుక బస్తాలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, ఈసమాచారాన్ని మత్స్యకారులకు, వారి నాయకులకు, బోట్ యజమానులకు చేరవేయాలని, అవసరమైన బోట్లు సిద్ధంగా ఉంచాలని మత్స్యశాఖ అధికారులను జెసి ఆదేశించారు. తీరప్రాంత మండలాల్లో ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద బియ్యం, నిత్యావసరాలు నిల్వలు సిద్ధంగా ఉంచాలని డిఎస్‌ఒను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తుపాను ప్రభావిత మండలాల్లోని అన్ని పిహెచ్‌సిల్లో వైద్యాధికారులను అప్రమత్తం చేసి, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య బందాలను సిద్ధం చేయాలన్నారు. సహాయ పునరావాస కేంద్రాల వద్ద వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, అన్ని పిహెచ్‌సిలు, సిహెచ్‌సిల్లో పవర్ బ్యాకప్ ఉండేలా చూడాలన్నారు. ఆయా మండలాల తహశీల్దార్లు, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవాలన్నారు. మెరైన్ పోలీసులను అప్రమత్తం చేయాన్నారు. సహాయ కేంద్రాల వద్ద అవసరమైన బందోబస్తు చర్యలు తీసుకోవాలన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు, బందరు, అవనిగడ్డ డిఎస్‌పిలు, డిఎంఅండ్ హెచ్ డాక్టర్ గీతాబాయి, ఆర్‌డిఒ ఐ.కిషోర్ పాల్గొన్నారు.










