Jan 13,2023 21:54

సరుకుల తూకాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో

ధర్మవరం టౌన్‌ : చౌకదుకాణాల ద్వారా నిరుపేదలకు అందించే బియ్యం, తదితర వస్తువుల తూకాల్లో తేడాలొస్తే డీలర్లపై చర్యలు తప్పవని ఆర్డీఓ తిప్పేనాయక్‌ హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని మార్కెట్‌ వీధిలో ఉన్న చౌకధాన్య డిపో 19, 20ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా చౌకదుకానంలోని బియ్యం, కందిబేడలు పరిశీలించారు. చక్కెరను తూకం వేసి చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి నాణ్యమైన బియ్యంతోపాటు కందిబేడలు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. రేషన్‌ దుకాణాల్లో లబ్ధిదారులకు ఖచ్చితమైన తూకాలు అందించాలన్నారు. ఎవరైనా డీలర్లు తప్పుడు తూకాలు వేసినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సిఎస్‌ఒటి చెన్నకేశవనాయుడు, వీఆర్వో యోగీశ్వర్‌రెడ్డి, స్టోర్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు పరంధామరెడ్డి, తదితరులు ఉన్నారు.