'అల్లంత దూరాన ఉన్న అడవితల్లిని నేను/ పచ్చని చెట్లతో నిగనిగలాడుతున్నాను/ నల్ల వాగు పరుగులు / పులులు జింకలు ఎన్నో జంతువులకు ఆసరా/ చెంచు జాతులన్ని నా నీడలో/ హాయిగా ఆనందంగా ప్రకృతితో పరవశించి/ ఉల్లాసంగా ఉన్న నల్లమలను నేను' అంటూ ఓ కవయిత్రి అడవి గొప్పదనాన్ని వర్ణిస్తారు. ప్రకృతిని పచ్చగా, ఆహ్లాదకర, ఆరోగ్యకర వాతావరణంగా మార్చే శక్తి ఒక్క వృక్షాలకే వుంది. అందుకే అంటారు 'వృక్షో రక్షతి రక్షితః' అని. 'బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటెగాదు/ చచ్చి కూడ చీల్చి ఇచ్చు తనువు/ త్యాగభావమునకు తరువులే గురువులు' అంటారు జంధ్యాల పాపాయ్యశాస్త్రి. 'పట్టణ, నగర బతుకులకు అలవాటు పడినవారు ఒక్కసారి అడవిలోకి వెళితే భరించలేనంత నిశ్శబ్దం అనుభవంలోకి వస్తుంది. ఏ శబ్దమూ లేని ప్రశాంత సౌందర్యం వారిని ఉన్మత్త పరవశంలోకి తీసుకెళుతుంది' అని 'వనవాసి' నవలలో అడవి అందాలను మన కళ్ళకు కడతారు విభూతి భూషణ్ బందోపాధ్యాయ. ఆహారం జీవనోపాధికి సంబంధించి మన జీవితాలు సముద్రం మీద ఆధారపడినట్లే... భూమిపై కూడా ఆధారపడి వుంటుంది. భూభాగంలో మూడింట ఒక వంతు ఆక్రమించిన అడవులు... మానవ మనుగడలో కీలకమైన పాత్ర వహిస్తాయి. దాదాపు 160 కోట్ల ప్రజలు- రెండువేల కంటే ఎక్కువ దేశీయ సంస్కృతులతో సహా - వారి జీవనోపాధి, మందులు, ఇంధనం, ఆహారం, ఆశ్రయం కోసం అడవులపైనే ఆధారపడి ఉన్నారు. పర్యావరణ, ఆర్థిక, సామాజిక, ఆరోగ్య ప్రయోజనాలెన్ని ఉన్నప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా అడవుల విధ్వంసం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది.
హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమిని నానా హింస పెట్టి, చాపలా చుట్టి, సముద్రంలో విసిరిపారేశాడని కథగా చెబుతుంటారు. ఆ కథలో ఒక్క రాక్షసుడితోనే భూమాత అనేక బాధలు పడింది. అలాంటిది నిజ జీవితంలో లక్షలాది మంది హిరణ్యాక్షులు భూమిని, అడవులను ధ్వంసం చేస్తున్నారు. మనిషి రాక్షసత్వం ఇలాగే వుంటే... భూతాపం, వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. సముద్రాలు పొంగుతాయి. వరదలు ముంచెత్తుతాయి. ఆక్సిజన్ అందక సమస్త జీవరాశులు అల్లాడిపోతాయి. కరువు కాటకాలతో మానవాళి తీవ్రమైన ఆహార సంక్షోభంలో చిక్కుకుంటుంది. ఇది వాస్తవం. అడవులంటే కేవలం చెట్లు... గుట్టలు... జంతువులు, మానవ సమూహం మాత్రమే కాదు. సమస్త మానవాళి మనుగడకు అవసరమైన మూలధాతువు అడవి. మనిషి జీవనాధారమైన గాలి, ఆహారం, ఔషధ మూలికలు వంటివి చెట్ల నుండే లభ్యమవుతాయి. 'అడవులు వందల కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి బయటపడేయగలవు. కోట్ల మందికి ఉద్యోగాలను సృష్టించగలవు' అని ఐరాస అధ్యయనం వెల్లడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిముషానికి వందలాది ఎకరాల అడవులను నరికివేస్తున్నారని ఒక అంచనా. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి అడవులు దాదాపు అంతరించిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనేక సామాజిక, ఆరోగ్య, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అటవీ నిర్మూలన ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది.
అడవి మానవాళికి తల్లి లాంటిది. అడవి లేనిదే నగరం లేదు... అడవి లేనిదే జీవనం లేదు. మానవ నాగరికత వికాస పరిణామం లేదు. శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతగా పురోగమించినా అడవుల ఉనికి.. మానవాళి మనుగడకు ఊపిరి. అలాగే, గిరిజనుల జీవనానికి... అడవులకు మధ్యగల సంబంధం విడదీయలేనిది. తరతరాలుగా అడవులపై గిరిజనులు వారసత్వపు హక్కును సహజంగానే అనుభవిస్తున్నారు. అడవులను ఆదాయవనరులుగా మార్చుకున్న కార్పొరేట్లు, ప్రభుత్వాలు... ఆ అడవుల నుండి, వారి హక్కుల నుండి గిరిజనులను దూరం చేస్తున్నారు. అటవీ సంరక్షణ, క్రమబద్ధీకరణ పేరుతో ఆదివాసీల హక్కులు కాలరాస్తున్నారు. అడవుల్లో నిక్షిప్తమైన ఖనిజాలను తవ్వే కార్పొరేట్లకు స్వాగతం పలుకుతున్నారు. గ్లోబలైజేషన్ పేరిట చెలరేగే ఈ సామ్రాజ్యవాదశక్తులకు మానవముఖం ఉండదు. ఈ శక్తులు అడవుల జీవికను సమూలంగా ధ్వంసం చేస్తున్నాయి. కార్పొరేట్ శక్తుల విధ్వంసం నుంచి అడవులను కాపాడుకోవడం తక్షణావసరం. అడవులను కాపాడుకోవడం అంటే... మన ప్రాణాలను మనం కాపాడుకోవడమే. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, భవిష్యత్తరాలను కాపాడుకోవడానికి అడవులు కీలక పాత్ర పోషిస్తాయి. అడవులు, పర్యావరణ వ్యవస్థలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ 'అంతర్జాతీయ అటవీ దినోత్సవం' ఒక అద్భుతమైన సందర్భం. సామాజిక సంకల్పంగా స్వీకరించడానికి ఇది సరైన సమయం.










