ట్రూఅప్ పేరిట ప్రభుత్వం కరెంటు ఛార్జీలను పెంచేసింది. 2023 ఏప్రిల్ నుంచి విద్యుత్ ఛార్జీలను పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. యూనిట్‌కు సగటున 23 పైసల చొప్పున పెంపుదల అనివార్యమైంది. జిల్లాపై రూ.రెండు కోట్ల మేర భారం పడింది. జిల్లాలోని వ్యవసాయ అనుబంధ రంగాలైన ఆక్వా కల్చర్, రొయ్యల సాగు, కోళ్ల పరిశ్రమ, గృహావసరాలు, కమర్షియల్, ఇండిస్టియల్, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దేవాలయ సర్వీసుల వరకు విద్యుత్ కనెక్షన్లన్నింటికీ కరెంటు ఛార్జీల పెంపు ఖాయమని తేలిపోయింది. ప్రభుత్వం పేద, ధనిక తార తమ్యం పాటించకుండా ట్రూఅప్ ఛార్జీలను బాదేయడం పట్ల విమర్శల వర్షం కురుస్తోంది. ప్రజాశక్తి - కడప ప్రతినిధి
ఉమ్మడి జిల్లాలో 10.85 లక్షల విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. ఇందులో 7.96 లక్షల గృహాల విద్యుత్ కనెక్షన్లు, 85.8 వేల వాణిజ్య కనెక్షన్లు, 4,211 పరిశ్రమల కనెక్షన్లు, 2.70 లక్షల ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దేవాలయాల సర్వీసులు, 1.71 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో హెచ్‌విడిఎస్ 267 సబ్‌స్టేషన్ల పరిధిలో ఆరు కేటగిరీలుగా విద్యుత్ కనెక్షన్లను విభజించారు. వీటిన్నింటి పరిధిలోని కనెక్షన్లన్నింటికీ ట్రూఅప్ ఛార్జీల పెంపును వర్తిం పజేసింది. ఫలితంగా రాష్ట్రప్రభుత్వానికి పేద, ధనికలనే తేడాలు లేకుండా ధనికులపై ప్రేమను ఒలకబోయడం తాను ధనికుల పక్షపాతిని అనే ముద్రను స్థిరం చేసుకుందనే విమర్శను సుస్థిరం చేసుకుందని చెప్పవచ్చు.
2014 నాటి భారం షురూ!
2014 నుంచి 2019 వరకు వచ్చిన ఆర్థిక నష్టాలను భర్తీ చేయడంలో భాగంగా ట్రూప్‌ఛార్జీలను పెంచేసింది. 2022 ఆగష్టు నుంచి 2025 జులై వరకు యూనిట్‌కు రూ.23 పైసలు చొప్పున పెంచేసింది. 2025 జులై వరకు ప్రతి నెలా ట్రూఅప్ పేరిట అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది. ఈ ఏడాది మార్చిలో 10.96 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగమైంది. నెలకు ట్రాన్స్‌కో ఆదాయం రూ.70 కోట్ల వసూలైంది. 2023 ఏప్రిల్‌లో 11 లక్షల యూనిట్లు విని యోగం కానుందని అంచనా. జిల్లాపై సుమారు రూ.2.5 కోట్లకు పైగా భారం పడనుంది. నెలకు రూ.72.5 కోట్ల మేర ఆదాయం సమకూరనుంది.
పేదలను కొట్టి..
ట్రూఅప్ ఛార్జీల పెంపుదల సామాన్యులను సమిదలుగా మార్చాయనే వాదన వినిపిస్తోంది. జిలా ్లవ్యాప్తంగా బిపిఎల్ కేటగిరీ కింద ఎనిమిది లక్షల కుటుంబాల వరకు ఉన్న సంగతి తెలిసిందే. పేదల ప్రభుత్వమని చెప్పుకునే పాలకులు ఇటువంటి సామాన్యులను ఛార్జీల పెంపుదల నుంచి మినహాయించకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది ప్రస్తుత ట్రూఅప్ ఛార్జీల పెంపు విషయంలో జిల్లాలోని 85 వేల కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లు, 4,211 పరిశ్రమల విద్యుత్ కనెక్షన్ల మీద ట్రూఅప్ ఛార్జీల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం సముచితం. ఇటువంటి ఆలోచన చేయకుండా సామాన్య విద్యుత్ వినియోగదారుల మీద ట్రూఅప్ ఛార్జీల భారాన్ని వేయడం పట్ల సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది.
గత పెంపుదలకు భిన్నంగా
గత కరెంటు ఛార్జీల పెంపునకు భిన్నంగా ఛార్జీలను పెంచింది. గతంలో కరెంటు ఛార్జీల పెంపుదలను పరిశీలిస్తే శ్లాబ్ రేట్ల ప్రకారం పెంచేయడం తెలిసిందే. దీన్నిబట్టి గమనిస్తే పేదల విద్యుత్ వినియోగం పరిమితం. దీన్నిబట్టి పేదలపై భారం పరిమితంగానే ఉండేది. తాజా ట్రూఅప్ ఛార్జీల విషయంలో పేద, ధనిక కనెక్షన్లనే తారతమ్యం లేకుండా ఛార్జీల పెంపు అనివార్యమైంది. జిల్లాలోని కమర్షియల్, విద్యుత్ కనెక్షన్లపై ట్రూఅప్ ఛార్జీలను వసూలు చేయడానికి బదులుగా కరెంటు కనెక్షన్లన్నింటికీ ఛార్జీలను పెంచడంపై విమర్శల వర్షం కురుస్తోంది. టెలిస్కోపిక్ వినియోగదారులకు వాత పెట్టనుందని అర్థమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ హయాంలో దళిత కాలనీల్లో ఒక బల్బును ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. ప్రస్తుత ప్రభుత్వం ఆయన ప్రవేశపెట్టిన ఒక బల్బు ఉచిత విద్యుత్ వినియోగ పథకానికి తిలోదకాల్చింది. ఫలితంగా లక్ష మందికిపైగా ఒక బల్బు లబ్ధిదారులు నష్టవడం తెలిసిందే. తాజా ఛార్జీల పెంపుదలతో దళితుల పైనా భారం పడడం ఖాయమని తేలిపోయింది. ఛార్జీల పెంపును పరిశీలిస్తే సామాన్య, పేద, దళిత, అనే తేడా లేకుండా ఛార్జీల భారం ఖాయమని తేలిపోయింది.










