Apr 02,2022 19:23

తిరువనంతపురం : సిపిఎం 23వ జాతీయ మహా సభల సందర్భంగా కన్నూర్‌ ప్రాంతం కళకళలాడుతోంది. ఏ వీధి చూసినా పూలమాలతో, ఎర్ర జెండాల రెపరెప లాడుతోంది. నగరమంతా సుందరంగా ముస్తాబయింది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన కవాతులో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎర్రజెండాలు చేతబూని మేము సైతం అంటూ కవాతులో భాగస్వామ్యులయ్యారు. రేపటి ఆశాజ్యోతిగా చెబుతున్న పెద్ద జెండాను మోస్తూ... ఉక్కపోతలోనూ క్రీడాకారులు పట్టువీడకుండా.. జాతాలో పాల్గొన్నారు. ద్విచక్రవాహనాలపై వందలాది మంది క్రీడాకారులు, రెడ్‌ వాలంటీర్లు ఊరేగింపుగా తరలివచ్చారు. కన్నూర్‌లోని కన్వెన్షన్‌ సిటీలో జెండా ఎగురవేసిన కవాతుకు.. సాంస్కఅతిక రాజధాని త్రిసూర్‌ జిల్లాలో ఘనస్వాగతం లభించింది. వాయలార్‌ అమరవీరుల భూమి నుంచి బయలుదేరిన పాదయాత్ర శనివారం ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రమైన కొరట్టి పొంగం వద్దకు చేరుకుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, జాతా కెప్టెన్‌ ఎం.స్వరాజ్‌ నుంచి జిల్లా కార్యదర్శి వర్గీయులు జెండాను స్వీకరించారు. కేంద్ర కమిటీ సభ్యుడు కె.రాధాకఅష్ణన్‌ జాతా కెప్టెన్‌కు పూలమాల వేసి స్వాగతం పలికారు. జాతా కెప్టెన్‌, మేనేజర్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు సిబి చంద్రబాబు, వివిధ సంస్థాగత అధికారులు స్వీకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎసి మొయిదీన్‌ ఎమ్మెల్యే, ఎంకె కన్నన్‌, మంత్రి ఆర్‌ బిందు, ఎర్నాకులం జిల్లా కార్యదర్శి సిఎన్‌ మోహనన్‌, గోపి కొత్తమురిక్కల్‌ పాల్గొన్నారు. ఈ యాత్ర శనివారం వడక్కన్‌చేరిలో ముగుస్తుంది. ముగింపు బహిరంగ సభను కేంద్ర కమిటీ సభ్యులు ఎ విజయరాఘవులు ప్రారంభిస్తారు.