సన్న, చిన్నకారు రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి బడా కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు ఉద్దేశించిన మూడు చట్టాలు రద్దు చేయాలని రైతులు నాలుగు వారాలుగా పోరాడుతుంటే పట్టించుకోకుండా, ఉద్యమంపై అబద్ధపు ప్రచారానికి దిగడం మోడీ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనం. స్వతంత్ర భారత చరిత్రలో ఇదివరకెన్నడూ లేని రీతిలో రైతులు సాగిస్తున్న అసాధారణ పోరాటానికి యావద్దేశం మద్దతు పలుకుతుంటే రైతులను ఉగ్రవాదులని, ధనిక రైతుల కోసమే ఉద్యమం చేస్తున్నారని మొదట ప్రచారం చేసింది. రైతులను గందరగోళపరచి, ఉద్యమంలో చీలిక తేవటానికి రకరకాల కుయుక్తులు పన్నింది. వీటన్నిటిని తిప్పికొడుతూ రైతాంగం ఐక్యంగా ముందుకు సాగడంతో బాణీ మార్చింది. రైతు ఉద్యమానికి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని, పాకిస్తాన్, చైనాల హస్తం ఉందంటూ కొత్త పల్లవి అందుకుంది. దీనిని కూడా రైతులు తిప్పికొట్టడంతో అయోధ్యలో మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించే శక్తులే ప్రస్తుత ఉద్యమం వెనుక వున్నాయంటూ మతాన్ని ఇందులోకి లాగే ప్రయత్నం చేసింది. ఇది అంతగా క్లిక్ కాకపోవడంతో ప్రతిపక్షాల మీద ముఖ్యంగా వామపక్షాల మీద విరుచుకు పడింది. రైతుల ఉద్యమం కమ్యూనిస్టులు, వామపక్ష తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోతోందని నిందలు మోపింది. రైతులు స్వచ్ఛందంగా ఆందోళన నిర్వహిస్తుంటే ప్రతిపక్షాల గురించి బిజెపి, ఆరెస్సెస్ మాట్లాడడం విడ్డూరంగా వుంది. ప్రపంచవ్యాపితంగా సబ్సిడీలు, రక్షణలు కల్పించి వ్యవసాయాన్ని ఆదుకునేందుకు ఆయా దేశాలు ప్రయత్నిస్తుంటే, మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ప్రభుత్వ మార్కెటింగ్ వ్యవస్థను నాశనం చేసేందుకు పూనుకుంది. రైతులను కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలిపెడుతున్నది. సొంత రైతులపైనే ప్రభుత్వం ఈ విధమైన నీచపు ప్రచారానికి ఒడిగట్టడం హేయమైన చర్య. దీనికి కార్పొరేట్ ప్రచార బాకాలు వంతపాడడం ఆందోళనకరం. వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనకరమైనవి అన్నట్లుగా 'కుహనా' నిపుణులతో ప్రచారం చేస్తోంది. కరడుకట్టిన బిజెపి, ఆరెస్సెస్ ఐటి నిపుణులతో కూడిన ఈ అబద్దాల ఫ్యాక్టరీ ఇరవైనాలుగ్గంటలూ పనిచేస్తూ పెద్దఎత్తున తప్పుడు సమాచారాన్ని కుమ్మరిస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి విఫల యత్నం చేస్తోంది. ఉద్యమం పంజాబుకే పరిమితమని అదేపనిగా అరిగిపోయిన రికార్డులా కొంత కాలం ప్రచారం చేశారు. దేశ రాజధాని శివార్లలో భయంకరమైన చలిలో వేలాదిమంది రైతులు, మహిళలు కుటుంబ సభ్యులతో వచ్చి ఆందోళన చేస్తుంటే వారి స్థితిగతుల గురించి పట్టించుకోకుండా ప్రభుత్వం ఈ చట్టాలపై కొంచెం కూడా వెనక్కి తగ్గరాదని సలహాలిస్తున్నది. కావాలంటే వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేయవచ్చని సుద్దులు చెబుతోంది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, బడా కార్పొరేట్లు కుమ్మక్కై విమానాశ్రయాలు, రైల్వేలు, పోర్టులు, బిఎస్‌ఎన్‌ఎల్, బ్యాంకులు ఇలా వేటినీ విడిచి పెట్టకుండా ప్రవేటీకరిస్తుంటే కార్పొరేట్ మీడియా 'ఆహా...ఓహో' అంటున్నది. చివరికి వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్లకు అప్పగించేందుకు తెగబడింది. 130 కోట్ల మంది ప్రజలకు తిండి పెట్టే అన్నదాతలను రోడ్డున పడేలా చేసింది. రైతు సంఘాలను కానీ, రాష్ట్రాల ప్రభుత్వాలను కానీ కనీసం సంప్రదించకుండా, పార్లమెంటులో ప్రతిపక్షాల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ పచ్చి నిరంకుశంగా తీసుకువచ్చిన ఈ చట్టాలు రైతుల ప్రయోజనాలకోసమే అని చెప్పడం ఎవర్ని వంచించటానికి? వ్యవసాయ రంగాన్ని అదానీ, అంబానీల గుప్పెట్లో పెట్టే ఈ చట్టాలను, వినాశకర విద్యుత్ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాల్సిందే. కార్పొరేట్ల ప్రయోజనాలే దేశ ప్రయోజనాలుగా చూపేందుకు కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం రైతుల ఘోషను ఆలకించాలి. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం ఆపి రైతుల న్యాయసమ్మతమైన డిమాండ్లను అంగీకరించాలి.










