ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతుల పార్లమెంట్ ఎదుట ఆందోళన మాత్రమే చేస్తారని, పార్లమెంట్‌ను ముట్టడించడం లేదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) పేర్కొంది. పార్లమెంట్ వద్ద ఆందోళనకు సంబంధించి పూర్తి వివరాలు ఢిల్లీ పోలీసులకు అందజేశామని తెలిపింది. ఢిల్లీ పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని విమర్శించింది. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికింది. రైతు ఉద్యమానికి మద్దతుదారులు లండన్‌లోని భారత హైకమిషన్ వెలుపల నిర్వహించిన నిరసనను ఎస్‌కెఎం అభినందించింది. ఈ మేరకు సోమవారం ఎస్‌కెఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, డాక్టర్ దర్శన్ పాల్, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లెవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, శివకుమార్ శర్మ 'కక్కాజీ', యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయని, పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్ష ఎంపిలు రైతుల డిమాండ్లు లేవనెత్తారని తెలిపారు. ఇప్పటికే అన్ని పార్టీల ఎంపిలకు ఎస్‌కెఎం ప్రజా విప్ జారీ చేసిందని, కొంతమంది ఎంపిలను ఎస్‌కెఎం బృందం ప్రత్యక్షంగా కలిసి విప్‌ను అందజేసినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగానే పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపిలు రైతుల సమస్యలను లేవనెత్తారని, రైతుల నినాదాలను హోరెత్తించారని ఎస్‌కెఎం నేతలు తెలిపారు. రైతుల డిమాండ్లను ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తితే, దానికి సమాధానం చెప్పకుండా ప్రతిపక్ష ఎంపిలపై ప్రధాని ఎదురుదాడికి దిగారని ఎస్‌కెఎం నేతలు విమర్శించారు. ఎస్‌సి, ఎస్‌టి, మహిళా సభ్యుల పట్ల ప్రతిపక్షాలకు గౌరవం లేదని ప్రధాని అనడం దారుణమని, ప్రతిపక్షాలు రైతుల డిమాండ్లు లేవనెత్తాయని, ప్రధానికి రైతుల పట్ల గౌరవం ఉందా? అని ప్రశ్నించారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిసర ప్రాంతాల్లో కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ బిల్లు-2021, విద్యుత్ సవరణల బిల్లు-2021ను వర్షాకాల సమావేశాల్లో ఆమోదించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం లెజిస్లేటివ్ బిజినెస్ కింద జాబితా చేసిందని ఎస్‌కెఎం నేతలు పేర్కొన్నారు. ఈ రెండింటిపై రైతులకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. వాటిని ఉపసంహరించుకునేందుకు 2020 డిసెంబర్ 30న రైతులతో జరిగిన చర్చల్లో కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఎస్‌కెఎం నేతలు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో ఆ రెండు బిల్లులను ఎలా ప్రవేశపెడుతుందని ప్రశ్నించారు.










