పీలేరు సబ్ జైలులో టిడిపి కార్యకర్తలకు చంద్రబాబు పరామర్శ
ప్రజాశక్తి-పీలేరు : పెద్దిరెడ్డీ ఇకనైనా నీ అరాచకాలు మానుకో, నిన్నూ, నీ పార్టీ జెండాను పాతడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయడు అన్నారు. పీలేరు సబ్‌జైలులో ఉన్న పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలానికి చెందిన టిడిపి కార్యకర్తలను పరామర్శించడానికి సోమవారం చంద్రబాబు నాయుడు సబ్ జైలు వద్దకు చేరుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లి నుంచి బయలుదేరిన ఆయనకు దారి పొడవునా పార్టీ నాయకులు, కార్యకర్తలు నీరాజనాలు పలికారు. పీలేరు పట్టణంలోని నాలుగురోడ్ల కూడలి నుంచి సబ్ జైలు వరకు కూడా జనం తండోప తండాలుగా తరలివచ్చి బాబుకు బ్రహ్మరథం పట్టారు. వైసిపి తప్పుడు కేసుల కారణంగా సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న టిడిపి కార్యకర్తలను పరామర్శించారు. అనంతరం జైలు బయట ప్రజలను ఉద్ధేసించి ప్రసంగించారు. తన పర్యటన జరిగే ప్రతి చోటా పోలీసులు 30 యాక్టును ప్రయోగిస్తున్నారన్నారు. తాను మాట్లాడటానికి మైకు కూడా లేకుండా సీజ్ చేశారని ఆరోపించారు. వైసిపి గూండాలు ఈ నెల 6న టిడిపి ఫ్లెక్సీలు చింపేస్తే పోలీసులు ఏంచేస్తున్నట్లని ప్రశ్నించారు. తిరిగి వారు 7వ తేదీ కూడా అరాచకాలు సృష్టిస్తూ టిడిపి కార్యకర్తలను రెచ్చగొడుతూ మాట్లాడారని చెప్పారు. ఇరు పార్టీలను సమాన దృష్టితో చూడాల్సిన పోలీసులు కూడా ఏక పక్షంగా వ్యవహరిస్తూ 13 మంది పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టారన్నారు. వారిలో 8 మందిని అరెస్టు చేసి కేసులో టిడిపికి చెందిన నాయకులను ఇరికించడానికి పేర్లు చెప్పాలంటూ పట్టుబడ్డ వారిని పోలీసులు నానా హింసలు పెట్టారని కూడా చెప్పారు. ఈ సందర్భంగా టిడిపి కార్యకర్తలు గాయడ్డారన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు టిడిపి నాయకులు, కార్యకర్తలపై 10 తప్పుడు కేసులు పెట్టి వందల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను జైల్లో పెట్టించారన్నారు. గత ఏడాది డిశంబరు 4న పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ సదుంలో రైతుభేరీ నిర్వహించడానికి హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నా స్థలం ఇవ్వకుండా, అదే రోజు రాత్రి 200 మంది వైసిపి గూండాలు అతని ఇంటిపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. డిశంబరు 25న పెద్దిరెడ్డి పర్యటన సందర్భంగా తన ఇంటిపై బ్యానర్లు కట్టవద్దన్న న్యాయవాది నవీన్ కుమార్‌పై పెద్దిరెడ్డి గుండాలు వచ్చి దాడికి యత్నించారన్నారు. న్యాయవాది, అతని తండ్రిపై కేసులు నమోదు చేశారని తెలిపారు. ఈ నెల 2న చౌడేపల్లి మండల పార్టీ అధ్యక్షులు రమేష్‌కుమార్‌రెడ్డి తన ఇంటి ముందు వైసిపి తోరణాలు తొలిగించాలన్నందుకు 49 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పెట్టించారన్నారు. 2023 జనవరి 3న చౌడేపల్లి మండలం, బోడుకొండ గంగాపురంకు చెందిన టిడిపి కార్యకర్త రెడ్డిప్పకు చెందిన 1.5 ఎకరాల భూమి వైసిపి వారు హస్తగంతం చేసుకున్నారని చెప్పారు. ఇవే కాదు ఇంకెన్నో కేసులు పెట్టారనీ, పోలీసులను పహారా పెట్టి కోడి పందాలు నడుపుతున్నారని పేర్కొన్నారు.. పక్కరాష్ట్రాల నుంచి మద్యం తెప్పించి అమ్ముతున్నారని తెలిపారు. దీనికంతటికీ కారణం పెద్దిరెడ్డి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, విజయమ్మ, షర్మిల, జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలు చేశారన్నారు. వీరిలా తాము ఆలోచించి ఉంటే జగన్మోహన్‌రెడ్డి తిరిగి ఉండేవాడా పెద్దిరెడ్డీ అని వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ముస్లిం మైనార్టీలపై దాడులు మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పోలీసు తీరుపై కూడా తీవ్రంగా మండి పడ్డారు. కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పుంగనూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి, తంబళ్ళపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, టిడిపి జిల్లా అధ్యక్షులు పులివర్తినాని, ఎమ్‌ఎల్‌సి దొరబాబు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఎ.షరీఫ్, రాజంపేట పార్లమెంట్ ఇన్‌ఛార్జి శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసులురెడ్డి, నాయకులు రాంప్రసాద్‌రెడ్డి, స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.










