ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ :మహిళల ఆర్థిక అభివద్ధికి తపాలా శాఖ ఆధ్వర్యంలో కేంద్రం చేయూత అందించినున్నట్లు జిల్లా పోస్టల్ సూపరిండెండెంట్ ఎం.చెన్నకేశవులు పేర్కొన్నారు. గురువారం మదనపల్లె పోస్టల్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలకు మరింత ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖలో నూతనంగా మహిళ సమ్మాన్ సేవింగ్స్ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పథకంలో చేరే మహిళలకు తక్కువ కాలంలో అధిక వడ్డీ పొందే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ఈ పథకం కేవలం మహిళల కోసమే ప్రారంభించినట్లు చెప్పారు. పథకంలో చేరదలచిన మహిళలు తమ సమీప పోస్ట్ ఆఫీస్‌లను సంప్రదించి మహిళ సమ్మాన్ బజత్ పత్ర యోజన ఫారంను పూర్తి చేసి ఇవ్వాలన్నారు. ఫారంతో పాటు ఆధార్, పాన్ కార్డ్ మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను జతపరచాలన్నారు. రెండేళ్ల కాల పరిమితి గల ఈ పథకంలో రూ.వెయ్యి నుంచి రూ. రూ.2 లక్షల వరకు మహిళలు పెట్టుబడులు పెట్టవచ్చన్నారు. మహిళలు పెట్టే పెట్టుబడులపై ప్రతి ఏటా 7.5 శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు తెలిపారు. 2025 మార్చి 31న ఈ పథకానికి చివరి తేదీని చెప్పారు. మదనపల్లె పోస్టల్ ఎఎస్‌పి బి.నీలిమ మాట్లాడుతూ తపాలా శాఖలో ప్రత్యేకంగా మహిళల కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మహిళ సమ్మాన్ సేవింగ్స్ పథకం కింద ఒక అకౌంట్ ఓపెన్ చేసిన మహిళ మూడు నెలల తర్వాత మళ్లీ మరో అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉందన్నారు. ఈ పథకంలో పెట్టుబడులు పెట్టిన మహిళలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి వారి ఖాతాలో వడ్డీ జమ చేయబడుతుందన్నారు. ఈ పథకంలో చేరిన మహిళలకు రుజువుగా ధ్రువీకరణ పత్రాలు కూడా పంపిణీ చేస్తామన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో మదనపల్లె హెడ్ పోస్ట్మాస్టర్ బి.వి.రమణమూర్తి, సిబ్బంది పి.అమర్నాథ్, డి.నిర్మలాదేవి పాల్గొన్నారు.










