పార్టీ సారథులు
1964లో ఏర్పడిన సిపిఎం తొలి ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య. ఆయన దక్షిణ భారతదేశంలోనే కమ్యూనిస్టు ఉద్యమ స్థాపకులు. సుందరయ్యతో రాజకీయంగా విభేదించే వారు సైతం ఆయన్ని ఎంతగానో ప్రేమించేవారు. గౌరవించేవారు. ఆయన నిరాడంబర జీవితం, ప్రజల కోసం అకుంఠిత దీక్షతో, నిజాయితీతో కృషి చేసిన ఆయన వ్యక్తిత్వం వారి ప్రేమ గౌరవాలకు పాత్రమైంది. 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' పుస్తకం రచించి ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ఆనాడే ఆయన పథకం రూపొందించారు. సుందరయ్య త్యాగనిరతి అసమానమైనది. భారత కమ్యూనిస్టు పార్టీలో మితవాద రివిజనిజానికి, అతివాద దుస్సాహసానికి వ్యతిరేకంగా పోరాటం జరిపిన నాయకుల్లో ఆయనొకరు. 1913లో నెల్లూరు జిల్లా అలగానిపాడులో ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించిన సుందరయ్య... 17 ఏళ్ళ ప్రాయంలో ఇంటర్మీడియట్ చదువును వదిలివేసి స్వాతంత్రోద్యమంలో దూకారు. ఆ తర్వాత అమీర్ హైదర్‌ఖాన్ మార్గదర్శకత్వంలో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ఇఎంఎస్ నంబూద్రిపాద్, పి.కృష్ణ పిళ్ళై, ఎ.కె.గోపాలన్ లాంటి వారు కమ్యూనిస్టు పార్టీలో చేరడానికి ఆయన కారకులయ్యారు. 1936లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆలిండియా కేంద్రం ఏర్పడినప్పుడు ఆయన కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. అప్పటి నుంచి జీవితాంతం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా కొనసాగారు. ఉమ్మడి పార్టీలోనూ, సిపిఎంలోనూ సుదీర్ఘకాలం పొలిట్‌బ్యూరోలో కొనసాగారు.
సుందరయ్య పార్లమెంటరీ రంగంలో కూడా అద్భుత ప్రతిభ కనపరిచి పాలక, ప్రతిపక్ష సభ్యులందరి మన్ననలు పొందారు. 1952లో రాజ్యసభకు ఎన్నికైన పార్లమెంటులో కమ్యూనిస్టు పక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా పలు దఫాలు ఎన్నికయ్యారు. 1964లో సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సుందరయ్య 1976 వరకు అంటే 12 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడానికి ఎంతగానో కృషి చేశారు. 1985 మే 19వ తేదీన ఆయన కన్నుమూశారు.










