ములకలచెరువు : బహిరంగ మార్కెట్లలో టమోటా ధరలు పతనమై రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించక అప్పుల బాధతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో వ్యవసాయ బోర్లు ఆయకట్టులో సుమారు 500 ఎకరాలకు పైగా టమోటా పంటలు వేశారు. పంట సాగుకు ఎకరాకు సుమారు లక్షకు పైగానే ఖర్చు చేశారు. ట్రాక్టర్ తో భూమి దుక్కి, నర్సరీల నుండి టమాటా మొక్కలు, ఎరువులు, జీవన ఎరువులు, టమోటా మొక్కలకి కర్రలు, క్రిమిసంహారక మందుల, కూలీలు కోసం లక్షకు పైగా ఖర్చు చేయక తప్పడం లేదు. టమోటా రైతు తన పంటకు గిట్టుబాటు కావాలనుకుంటే సుమారు 15 కిలోల కిరిటి కనీసం రూ.300 నుంచి రూ.400 ధర దక్కాలి. అయితే నేడు మార్కెట్లో టమోటా 15 కిలోల కిరిట ధర 100కు మించడం లేదు. దీంతో టమోటా రైతు గిట్టుబాటు ధర లేక టమోటాలను పెరకడానికి కనీసం కూలి ఖర్చు మిగలకపోవడంతో పొలాల్లోనే వదలక తప్పడం లేదు. మండలంలోని వేపూరికోట, పెద్దపాలెం, బురకాయలకోట, గుడిపల్లి, కాలుపల్లి తదితర పంచాయతీలలో రైతులు వందలాది ఎకరాల్లో టమోటా సాగు చేసి చేతులు కాల్చుకున్నారు. టమోటా పంటల కోసం రైతులు అంది న కాటికి ప్రయివేట్ అప్పులు చేశారు. మరికొందరు రైతులు బ్యాంకులలో బంగారు నగలు తాకట్టు పెట్టి పంటలు వేసి నేడు ఆ నగలు విడిపించు కోవడానికి వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. టమోటా రైతుల కష్టాలు వినే నాధుడే కరువయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం టమోటా రైతుల పంట నష్టాలకు ప్రత్యామ్నాయ ఏర్పాటుచేసి గిట్టుబాటు కల్పించాల్సిన అవసరముంది.










