Mar 03,2022 07:30

పదేళ్ళ విరామం అనంతరం తమిళనాడులో ఫిబ్రవరి 19న జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అనేక సందేశాలు, సంకేతాలు వెలువరించాయి. పాలక డిఎంకె తన ప్రధాన శత్రువుపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడమే కాదు, అన్నాడిఎంకె కూడా తన స్థానాన్ని మరింత సంఘటితపరుచుకుంది. కాంగ్రెస్‌, వామపక్షాలు, విదుతుల్లై చిరుతైగల్‌ కచ్చితో సహా మిత్రపక్షాలూ మంచి ఫలితాలే రాబట్టుకోగలిగాయి. పశ్చిమ ప్రాంతమైన నమక్కల్‌ నుండి కోయంబత్తూరు వరకు అన్నాడిఎంకెకు గట్టి పట్టు వున్న కోటను డిఎంకె దాని మిత్రపక్షాలు బద్దలు కొట్టడం ఈ ఫలితాల్లో కీలకమైన అంశం.

అన్నాడిఎంకె వరకు చూసినట్లైతే 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన ఈ ఎన్నికలు పెద్ద వూరటనివ్వలేదనే చెప్పాలి. డిఎంకె, అన్నాడిఎంకెల మధ్య తేడాను ఈ ఫలితాలు చూపాయి. తన కూటమిలో బలమైన భాగస్వామ్య పక్షంగా డిఎంకె పోటీ చేసిన 10,758 వార్డులకు గానూ 7,698 వార్డులను గెలుచుకుంది. మొత్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణ పంచాయితీల్లో 43.13శాతం ఓట్ల వాటాను సాధించింది. అన్నాడిఎంకె 11,538వార్డుల్లో పోటీ చేయగా, కేవలం 2,008 మాత్రమే గెలుచుకోగలిగింది. ఓటు వాటా 25.15శాతంగా వుంది.

తమిళనాడులో ప్రధానంగా రెండు రాజకీయ పార్టీల మధ్యనే వుండే పోటీని దృష్టిలో పెట్టుకుంటే రెండు ద్రవిడ పార్టీలు మెజారిటీ ఓటును సాధించినప్పటికీ బిజెపి, రాష్ట్రంలో ఒక కీలక శక్తిగా మారుతున్న సూచనలు కూడా గణనీయంగానే కనిపిస్తున్నాయి. 2019, 2021 ఎన్నికల్లో అన్నాడిఎంకె జూనియర్‌ భాగస్వామిగా పోటీ చేసిన బిజెపి ఈసారి ఒంటరిగానే పోటీ చేయాల్సి వచ్చింది. జనవరి చివరిలో అన్నా డిఎంకెతో సీట్ల సద్దుబాటు చర్చలు విఫలమయ్యాయి. 5,594 వార్డుల్లో పోటీ చేస్తే 308 వార్డులు తన ఖాతాలో వేసుకుంది.. 5.41శాతం ఓట్లను రాబట్టుకోగలిగింది. కాంగ్రెస్‌ 592 వార్డులు గెలుచుకుని, 3.31శాతం ఓట్లను సాధించింది. జాతీయ పార్టీ అయిన బిజెపి గెలుచుకున్న 308 వార్డుల్లో 200 వార్డులు ఆ పార్టీకి పట్టు వున్న కన్యాకుమారి జిల్లాలోనివేనని బిజెపి విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. అయితే బిజెపి దీన్ని తిప్పికొడుతోంది. కడలూరు, చెన్నై, వెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్లలో తాము ఖాతా తెరిచామని చెప్పుకుంటోంది. ఇక స్వంతంగా పోటీ చేసిన ఇతర చిన్న పార్టీలన్నీ ఏ మాత్రమూ ప్రాధాన్యత లేని స్థాయికి క్షీణించాయి. ఏ ఒక్క పార్టీ కూడా 2శాతం వాటా ఓట్లను దాటలేదు. ఈ ఎన్నికల ద్వారా అన్నాడిఎంకె గానీ లేదా మరే చిన్న పార్టీలు గానీ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఒక్కటే. కూటములు ఏర్పరచడం, పొత్తులు పెట్టుకోవడం ప్రధానం కాదని తెలుసుకోవాలి. అలాగే ఇక బిజెపి తమిళనాడులో కాలూనుకుంటుందని కూడా చాలా మంది ఊహాగానాలు చేస్తున్నారు. అయితే అదేమి అంత సులభం కాదు. అలాగే మరోపక్క అన్నాడిఎంకె నష్టపోయినప్పటికీ ఇంకా ఆ పార్టీకి గణనీయమైన పునాదులే వున్నాయని, వాటిని కదిలించడం అంత తేలిక కాదని ఫలితాలు చూసిన వారికి అర్ధమవుతోంది.
- ద హిందూ సౌజన్యంతో..