Jul 13,2021 17:57

చెన్నై : తమిళ స్టార్‌ హీరో విజయ్‌కి మద్రాస్‌ హైకోర్టు షాకిచ్చింది. రూ.లక్ష జరిమానాను విధిస్తూ తీర్పునిచ్చింది. సాధారణంగా విజయ్‌కి కార్లు అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర రోల్స్‌ రాయిస్‌ గోస్ట్‌, ఆడి ఏ8, బీఎండబ్ల్యు సిరీస్‌ 5, బీఎండబ్ల్యు 6, మినీ కూపర్‌ వంటి ఖరీదైన కార్లున్నాయి. వీటిలో రోల్స్‌ రాయిస్‌ గోస్ట్‌ అనే రూ.8 కోట్ల ఖరీదైన కారును 2012లో ఇంగ్లాండ్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ కారుకు దాదాపు రూ.1.6 కోట్లను పన్నుగా చెల్లించాల్సి ఉంది. అయితే ఈ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ విజయ్‌ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు విజయ్‌కు రూ.లక్ష జరిమానాను విధించింది. అంతే కాదు, కారు ఖరీదులో 20 శాతాన్ని (రూ.1.6 కోట్లు) రెండు వారాల లోపు పన్నుగా చెల్లించాలని తీర్పునిచ్చింది. విజయ్‌కు కోర్టు విధించిన జరిమానా మొత్తం తమిళనాడు సీఎం కొవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌కు వెళుతుంది.