Apr 17,2022 14:47
  • బాలీవుడ్‌ నటి కొంకణాసేన్‌ శర్మ ''పేజ్‌ 3'', ''ఓంకార'', ''లక్‌ బై ఛాన్స్‌'', ''తల్వార్‌'' వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. ఏ విషయాన్నైనా కుండబద్ధలు కొట్టినట్టు ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఆమెది. ముఖ్యంగా లింగ సమానత్వం మీద సందర్భం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాలను చెబుతూ ఉంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఫెమినిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటో వివరంగా తెలుసుకుందాం...

సమాజంలో ఉన్నప్పుడు కొన్నింటి గురించి నేర్చుకోవాలి. కొన్ని నియమాలు పాటించాలి అంటున్నారు బాలీవుడ్‌ నటి కొంకణాసేన్‌. తాజాగా ఒక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఫెమినిజంపై ఆమె అభిప్రాయాన్ని వెల్లడించారు. 'ఏ సినిమాలోనైనా స్త్రీవాది పాత్ర పోషించాల్సి వచ్చినప్పుడు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి వస్తుంది. దీన్నిబట్టి పురుషులు కూడా ఇలాంటి అనుభవమే ఎదుర్కొంటారు. స్త్రీ, పురుషుల మధ్య లింగభేదమే తప్ప ఆలోచనల్లో పెద్దగా మార్పులుండవని భావిస్తున్నాను. అందుకే ఇద్దరికీ సమానంగా గౌరవం, న్యాయం దక్కాలని కోరుకుంటున్నాను. నన్ను నేను ఎప్పుడూ ఒక మహిళనని తక్కువగా చూసుకోను. ఎవరైనా చూసినా ఒప్పుకోను. ఇతరుల కోసం అన్నింటినీ భరిస్తూ బాధపడటం నా వల్ల కాదు' అని చెప్పుకొచ్చారు కొంకణ.

  • నా కొడుకే సులభంగా నేర్పుతాడు

'పెద్దపెద్ద హిందీ డైలాగులు చెప్పడం అంటే నాకు చాలా భయం. ఆ డైలాగ్‌లు చెప్పడానికి టేకులు మీద టేకులు తీసుకున్న రోజులూ ఉన్నాయి. వాటిని నేర్చుకోవడానికి ఇంట్లో కుస్తీ పడుతూ ఉంటాను. అలాంటి సమయంలో నా కొడుకు నాకెంతో సహాయం చేస్తాడు. ఎంత పెద్ద డైలాగ్‌నైనా సులభంగా గుర్తుంచుకునేలా టిప్స్‌ చెప్తాడు. దాంతో అవి మరచిపోకుండా టకటకా చెప్పగలుగుతాను. అస్సలు నచ్చని విషయం ఏమిటంటే కెమెరా ముఖంలో ముఖం పెట్టి కొన్నిసార్లు డైలాగ్స్‌ చెప్పిస్తూ ఉంటారు. అది అస్సలు నచ్చదు' అంటున్నారు కొంకణసేన్‌.
ఈ నటి 2010లో యాక్టర్‌ రణ్‌వీర్‌ షోరేని వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లు సంతోషంగా ఉన్న ఈ జంట మధ్య మనస్పర్థలు రావడంతో 2020లో విడాకులు తీసుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కొంకణసేన్‌ తన భర్తకు విడాకులు ఎందుకివ్వాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. 'ఏ విషయం గురించైనా అతను చెప్పే మాటలే వినాలి. ఒకవేళ అలా కాదు ఇలా అని నా అభిప్రాయాన్ని వినిపించాలి అంటే ఒప్పుకోడు. నేనేదో తప్పు చేసినట్లు పరిగణిస్తాడు. అంతా తన ఇష్ట ప్రకారమే జరగాలని భావిస్తాడు. అతనికి సంబంధించి ఏ విషయమైనా, ఎలాగైనా మాట్లాడవచ్చని భావిస్తాడు. ప్రతిరోజూ నా ఉనికిని కోల్పోతూ సమాజం కోసం, అందులో ఉన్న జనాల కోసం అతనిని భరించాల్సిన అవసరం లేదు. అందుకే విడాకులు ఇచ్చాను. నాకంటూ ఓ ప్రత్యేక గది, బాత్రూం, ఏసీ ఉండాలి అనేది నా కోరిక. అలాంటి చిన్నచిన్న కోరికలు తీర్చుకునే అవకాశం లేని వ్యక్తితో కలిసి ఉండటం ఇష్టం లేదు. పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలని భావించాను. కొన్నిసార్లు ఎవరి అనుమతి లేకుండా నచ్చిన పనులు చేసేలా ఉండాలి. మా తల్లిదండ్రులు ఎప్పుడూ స్త్రీ, పురుష తేడాలతో పెంచలేదు. వాళ్ల దృష్టిలో ఇద్దరూ సమానమే. కాబట్టేనేమో పురుషాహంకారాన్ని తట్టుకోలేకపోయాను. నా కొడుకును పురుషుడిననే అహంకారం రాకుండా పెంచుతా' అని చెబుతున్నారు కొంకణా. సీనియర్‌ నటి, దర్శకురాలు, రచయిత అపర్ణాసేన్‌ కొంకణా తల్లి. ఆమె ప్రోత్సాహంతోనే కొంకణా బాలనటిగా ''ఇందిర'' అనే బెంగాలీ సినిమాలో నటించారు. పెద్దయిన తర్వాత ''ఏక్‌ జే ఆచా కన్యా'' చిత్రం ద్వారా పరిచయమయ్యారు. ఆసియా అకాడమీ క్రియేటివ్‌ అవార్డ్‌లో 2021లో ఉత్తమనటిగా ఆమె అవార్డును దక్కించున్నారు.

  • పూర్తిపేరు : కొంకణా సేన్‌
  • పుట్టినతేది : 3 డిసెంబర్‌, 1979
  • జన్మస్థలం : కోల్‌కతా, పశ్చిమ బంగ
  • వృత్తి : నటి, రచయిత,
  • దర్శకురాలు
  • పిల్లలు : కుమారుడు
  • తల్లిదండ్రులు: ముకుల్‌ శర్మ, అపర్ణాసేన్‌