హైదరాబాద్ : టిపిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి భారీ సంఖ్యలో నేతలు, రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. ముందుగా అనుకున్న ముహూర్తానికి అనుగుణంగా మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం గాంధీభవన్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 'సోనియమ్మ ఆశీస్సులతో ఈ పదవి చేపడుతున్నా. నాలుగు కోట్ల మంది ఆకాంక్షల మేరకు పనిచేయడానికే సోనియా గాంధీ నాకు ఈ బాధ్యత అప్పగించారు. నలుగురి చేతిలో 4 కోట్ల మంది బందీలయ్యారు. తెలంగాణలో స్వేచ్ఛ, స్వయం పాలన లేక పెద్ద దిక్కు లేకుండా పోయింది. తెలంగాణ ద్రోహులు గద్దెనెక్కి ఇష్టారీతిన ఆడుతున్నారు. కెసిఆర్ వచ్చాక ఎన్‌కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. అమరవీరులు, ఉద్యమకారుల కుటుంబాలను టిఆర్‌ఎస్ ఆదుకోలేదు. గులాబీ చీడను పొలిమేరలు దాటేవరకు తరమాలి. అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ వంటి నాయకుడు మన సైన్యాన్ని ముందుండి నడిపిస్తారు. నిరుద్యోగులు, దళితులు, బడుగు బలహీన వర్గాలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం నయవంచనకు గురిచేసింది. ఎపిలో కాంగ్రెస్ చనిపోయినా ఫర్వాలేదని భావించి తెలంగాణ ఇస్తే.. సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం లేదా? అని పేర్కొన్నారు. మన తెలంగాణ తల్లి.. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ అని కొనియాడారు. 4 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లలో సోనియమ్మ గుడి కట్టుకోవాలి. నాయకుల సందేశాన్ని గడప గడపకూ తీసుకెళ్లాలి. ప్రశాంత్ కిశోర్ (పికె)ను సలహాదారుగా పెట్టుకోవాలని కొందరు సూచిస్తున్నారు. మంచిదే.. కానీ, పాదరసం లాంటి మా కార్యకర్తలే పికెలు. ప్రతి కార్యకర్త కుటుంబ సభ్యులకు రెండేళ్లు సెలవు పెట్టాలి. రాష్ట్రం, దేశం కోసం పోరాడేందుకు కార్యకర్తలు ఇంట్లో అనమతి తీసుకోవాలి' అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్, పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.










