Jul 07,2023 09:33

డిప్యూటీ తహశీల్దార్‌ సీట్‌లో కూర్చోని ఆర్బాటంగా మ్యూటేషన్‌ పక్రియను చేపడుతున్న ప్రయివేటు వ్యక్తి

          చిలమత్తూరు : 'ఎవరేమనుకుంటే మాకేంటి మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం'. అన్నట్లు తయారైంది చిలమత్తూరు రెవెన్యూ అధికారుల తీరు. రెండు రోజుల క్రితం తహశీల్దార్‌ కార్యాలయం రికార్డుల గదిలో ప్రయివేటు వ్యక్తులు ప్రవేశించడం వివాదాస్పదం అయ్యింది. దీనిపై పత్రికల్లో వార్తలూ వచ్చాయి. ఉన్నతాధికారులు కూడా ఈ ఘటనపై వివరణ అడిగారు. పరిస్థితి ఇలా ఉన్నా ఇక్కడ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా గురువారం నాడు ఓ ప్రయివేటు వ్యక్తి ఏకంగా వీఆర్వో లాగిన్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో మ్యూటేషన్‌కు సంబంధించిన ఫిర్యాదులను సమర్థించడం లేదా తిరస్కరించడం పనులు చేస్తూ విలేకర్లు కంట పడ్డాడు. ఇదేం అని విలేకర్లు తహశీల్దార్‌ని ప్రశ్నిస్తే తహశీల్దార్‌ కార్యాలయంలో సరిపడా సిబ్బంది లేరని, అందుకే ప్రయివేటు వ్యక్తులను ఉపయోగించుకున్నామని చెప్పారు. ప్రజల స్థిరాస్తులకు సంబంధించి మొదలు కొన్ని కీలకమైన దస్తావేజులు రక్షణ, రికార్డుల నిర్వహణ తదితరం కార్యాలయంలో ఉంటాయి. ఇక భూములకు సంబంధించి ఆన్‌లైన్‌లో మరిన్ని వివరాలు ఉంటాయి. ఇంతటి విలువైన సమాచారం ఉన్న డిప్యూటీ తహశీల్దార్‌ కంప్యూటర్‌లో ప్రయివేటు వ్యక్తి మ్యూటేషన్‌ చేయడం వల్ల ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తహశీల్దార్‌ కార్యాలయంలో ప్రయివేటు వ్యక్తులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.